● 92 మంది విద్యార్థులు గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌కు ఆదివారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో నెల్లూరులో మొత్తం 12 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 3,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెల్లూరులోని 9 కేంద్రాల్లో 3015 మందికి 2954 మంది హాజరు కాగా, 61 మంది గైర్హాజరయ్యారు. గూడూరులోని 3 కేంద్రాల్లో 471 మందికి 450 మంది హాజరు కాగా, 21 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. కేంద్రాల ముఖ ద్వారాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. అయితే కొన్ని కేంద్రాల్లో సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో మరో వైపు మండుతున్న ఎండలకు ఉక్కపోతకు విద్యార్థులు ఇబ్బందులు పడినట్లు సమాచారం. విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు తాగునీరు, వేచి ఉండేందుకు వసతులు లేక ఎండ వేడిమి తాళలేక ఇబ్బందులు పడ్డారు.


