నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను చెప్పాలని సూచించారు.
● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నారు. జిల్లా నుంచి వినియోగదారులు 89777 – 16661 నంబర్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
బంగారం, వెండి చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం ఎల్‌బీఎస్ నగర్‌లో నవీన్ కుటుంబం నివాసం ఉంటోంది. అతని సోదరికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. దీంతో నవీన్ తన కుటుంబంతో కలిసి గతనెల 29వ తేదీన తమిళనాడులోని తిరుపోరూర్‌కు వెళ్లారు. నవీన్ కుటుంబం శనివారం రాత్రి ఇంటికొచ్చిచూడగా మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా లాకర్‌లోని 59 గ్రాముల బంగారు ఆభరణాలు, 450 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. బాధితులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు కేజీల
గంజాయి స్వాధీనం
● తునిలో కొనుగోలు
● తమిళనాడు వాసి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. టాటానగర్ – ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలుదిగి ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ప్రకాశంను అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగ్‌లో ఐదు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని విచారించగా కాకినాడ జిల్లా తునిలో కేజీ గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి తమ ప్రాంతంలో కేజీ రూ.10 వేలకు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించడంతో అరెస్ట్ చేశారు. తనిఖీల్లో కావలి, నెల్లూరు రైల్వే ఎస్సై వెంకటరావు, హరిచందన పాల్గొన్నారు.
నరసింహకొండపై సినిమా పాటలు..
● ఆలయ ఈఓ ఆగ్రహం
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని నరసింహకొండపై వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కల్యాణోత్సవం జరిగింది. మండపానికి సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి కొందరు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈఓ గోపీ అక్కడికి చేరుకుని ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ర తీసుకుని అక్కడ్నుంచి తరిమి కొట్టారు. అనంతరం పాటలు పెట్టిన మైక్‌సెట్ వారిని కూడా కర్రతో కొట్టారు. దీంతో వారు ఈఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆదివారం పెద్దల సమక్షంలో రాజీ చేశారు.
అటవీ ప్రాంతంలో పరిశీలన
రాపూరు: పెంచలకోన అటవీ ప్రాంతాన్ని ఆదివారం జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం సమీపంలోని వెలుగొండ అటవీ ప్రాంతమైన పెంచలకోన అడవుల్లో మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్లు వైఎస్సార్ జిల్లా చిట్వేలి ప్రాంతం నుంచి మంటలు వ్యాపించాయన్నారు. గుర్తించిన అటవీ శాఖ, బేస్ క్యాంప్ సిబ్బంది బ్లోయర్ల సహయంతో అదుపు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మంటలను ఆర్పుతున్నారని వివరించారు. వెంకటగిరి నుంచి ఎస్‌బీఆర్‌ఎఫ్ టీమ్‌ను రంగంలోకి దింపుతున్నామని, ఫైర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారన్నారు. గాలులు ఉధృతంగా ఉండటంతో మంటలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. అటవీ ప్రాంతంలోని గడ్డిని తగులబెట్టడంతో మంటలు చెలరేగాయన్నారు. అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు వివరించారు. సోమవారం నాటికి పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేస్తామన్నారు.


