ఆక్సిజన్‌ ప్లాంట్‌.. మూలకు..! | - | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ ప్లాంట్‌.. మూలకు..!

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

అల్లూరులో మూతపడిన వైనం

నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వ తీరు

ప్రైవేట్‌ పైనే ఆధారం

ప్రజల సొమ్ము వృథా

అల్లూరు: కరోనా సమయంలో ఆక్సిజన్‌ సరఫరాను నిరంతరాయంగా అందించేందుకు అల్లూరు ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ మూలనపడింది. కూటమి ప్రభుత్వ తీరు కారణంగా ప్రైవేట్‌ కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఆక్సిజన్‌పైనే ఆస్పత్రి అధికారులు ఆధారపడాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ వార్డులు, ఆపరేషన్‌ థియేటర్లలోకి సులువుగా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు పైప్‌లైన్లను కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవేమీ ఉపయోగంలో లేవు.

ఇలా ఎందుకో..

పీఎం కేర్‌ కింద అల్లూరు ప్రభుత్వాస్పత్రిలో ప్లాంట్‌ను 2021 అక్టోబర్‌ రూ.62 లక్షలతో పెట్టారు. కోవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో పేషెంట్ల కోసం నాటి ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేయించింది. అయితే దీనిని వినియోగించుకోవడం లేదు. ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ సరఫరా చేసే ఆక్సిజన్‌పైనే ఆధారపడుతున్న పరిస్థితులున్నాయి. ప్రత్యేకంగా ప్లాంట్‌ ఉన్నా కూడా భారీ మొత్తంలో నిధులను వినియోగిస్తున్నారు. ఉన్న ప్లాంట్‌ను బాగు చేయించకుండా అధికారులు ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు మాత్రం పెద్దపీట వేస్తున్నారు.

నెలకు 5 – 6 టన్నులు అవసరం

అల్లూరు ప్రభుత్వాస్పత్రికి నెలకు 5 నుంచి 6 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతుంది. దీనిని ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తుంటారు. సంవత్సరానికి రూ.లక్షల్లో ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను వినియోగంలోకి తెస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడదు.

Advertisement
 
Advertisement
Advertisement