అత్తారింటికి పెనుశిల లక్ష్మీనరసింహుడు | - | Sakshi
Sakshi News home page

అత్తారింటికి పెనుశిల లక్ష్మీనరసింహుడు

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

రాపూరు: పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆరురోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుపుకొన్న అనంతరం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మీని వివాహం చేసుకుని సతీసమేతంగా గోనుపల్లి గిరిజనవాడలోని అత్తారింటికి ఆదివారం చేరుకున్నారు. మండలంలోని గోనుపల్లి ఆలయంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవాల ముందు రోజు పెంచలకోనకు పల్లకిలో తీసుకెళ్తారు. ముగిసిన తర్వాత ఉత్సవ విగ్రహాలను గోనుపల్లి గ్రామానికి తీసుకురావడం ఆచారం. కోనలోని క్రేన్‌ మండపం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. బోయలు కాలినడకన గోనుపల్లికి బయలుదేరారు. అధికారులు, వేద పండితులు పెంచలకోన ఆర్చి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గోనుపల్లి గిరిజన కాలనీవద్ద ఉన్న చెంచురాజు ఇంటికి దొడ్డిదారిలో తీసుకొచ్చారు. శ్రీవారి కల్యాణం అనంతరం స్వామి దొంగదారిలో గ్రామానికి వచ్చారని నానుడి. పెంచలస్వామి గిరిజన వనిత అయిన చెంచులక్ష్మీదేవిని వివాహం చేసుకోవడంతో ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు. గోనుపల్లి నుంచి ఉత్సవమూర్తులు కోనకు వెళ్లే సమయంలో స్వామిని గిరిజనులు పెళ్లికొడుకును చేసి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నకానుకల కింద ఆరిమొలతాడు, ఇంజేటి గడ్డ, పుట్టతేనె మొదలైనవి సమర్పిస్తారు. అలాగే స్వామి తిరిగి వచ్చే సమయంలో అడవి ఫలాలను అందించారు. శ్రీవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన కాలనీలోనే ఉంచడంతో గిరిజనులు తమ కొత్తఅల్లుడికి ప్రత్యేక పూజలు చేసి పండగ జరుపుకొన్నారు. అనంతరం గోనుపల్లిలో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీ జనార్దన్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్‌రెడ్డి, ఉప ప్రధానార్చకులు సీతా రామయ్యస్వామి, పెంచలయ్యస్వామి భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement