● సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులో నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ ధరలను పెంచడం దారుణమని సీపీఎం నేతలు అన్నారు. నెల్లూరులో ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీనగర్ సెంటర్ నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో వనంతోపు సెంటర్ నుంచి కొండాయపాళెం సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య గ్యాస్ ధరను ఒకేసారి రూ.993 పెంచడం దారుణమన్నారు. గోదావరి బేసిన్‌లో పుష్కలంగా గ్యాస్ నిక్షేపాలున్నా రాష్ట్ర పాలకుల వైఫల్యం కారణంగా ప్రజలు భారం మోయాల్సి వస్తోందని ఆరోపించారు. గోదారి గ్యాస్ నిక్షేపాల్లో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తున్నా పాలకులు చోద్యం చూస్తున్నారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడమే బీజేపీ అజెండాగా మారిందని ఆరోపి ంచారు. ధర పెంపుతో చిన్న టిఫిన్ దుకాణాలు, వ్యాపారస్తులు, హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. చివరకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. హోటళ్లలో ఇప్పటికే జీఎస్టీ పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. చిన్నపాటి టిఫిన్ దుకాణాలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నేతలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, నరసింహ, చిరంజీవి, సుబ్బమ్మ, చెంగయ్య, పెంచలయ్య, శ్రీధర్, కొండా ప్రసాద్, పెంచల నరసయ్య, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, రఘురామయ్య, వజ్రమ్మ, భారతి, గోపీ తదితరులు పాల్గొన్నారు.


