అనుమతా.. మాకెందుకు | - | Sakshi
Sakshi News home page

అనుమతా.. మాకెందుకు

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

యథేచ్ఛగా అదనపు గదుల నిర్మాణం

పట్టించుకోని కమిషనర్‌

నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా భవన నిర్మాణం చేయాలంటే ముందస్తుగానే ఎన్‌ఎంసీలోని పట్టణ ప్రణాళికా విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చారు. తర్వాత నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే బారకాసు సెంటర్‌లో ఉన్న మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ భవన ప్రాంగణంలో జరుగుతున్న అదనపు గదుల నిర్మాణానికి కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి అనుమతి లేదని సమాచారం. అయినా సంబంధిత అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ భవన ప్రాంగణంలోనే నిర్మాణం జరుగుతోందని స్పందించడం లేదని ఆరోపణలున్నాయి. ప్రజలకు ఒకలా.. అసోసియేషన్‌కు మరోలా నిబంధనలు ఉంటాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కమిషనర్‌ నందన్‌ నిత్యం నూతన భవన నిర్మాణాల వద్దకెళ్లి అనుమతులున్నాయా?, నిబంధనల మేరకే పనులు జరుపుతున్నారా అని పరిశీలిస్తుంటారు. ఆయనకు ఈ అదనపు గదుల నిర్మాణం కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement