క్రీడా శాఖపై నిర్లక్ష్య నీడలు | - | Sakshi
Sakshi News home page

క్రీడా శాఖపై నిర్లక్ష్య నీడలు

May 2 2026 11:37 AM | Updated on May 2 2026 11:37 AM

నెల్లూరు(టౌన్‌): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ రకాల కోర్టులున్నాయి. ప్రధానంగా వాలీబాల్‌, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, సాఫ్ట్‌బాల్‌ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అథ్లెటిక్స్‌కు ఇద్దరు, బ్యాట్మింటన్‌కు ఒకరు, ఫుట్‌బాల్‌కు ఇద్దరు, స్విమ్మింగ్‌కు ఒకరు, వెయిట్‌ లిఫ్టింగ్‌కు ఒకరు మాత్రమే కోచ్‌లున్నారు. వాలీబాల్‌, బాస్కెట్‌బాట్‌, ఖోఖో, హాకీ, క్రికెట్‌, సాఫ్ట్‌బాల్‌, కబడ్డీ తదితర వాటికి లేరు. కోచ్‌లను కూడా శాప్‌ ఆధ్వర్యంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన రిక్రూట్‌ చేస్తున్నారు. అయితే ప్రధాన క్రీడలకు కోచ్‌లు లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖోఖోకు సంబంధించి విశ్రాంత డీఎస్‌డీఓ యతిరాజ్‌ శాప్‌ అనుమతితో శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులు వచ్చి ఎవరికి వారే ఆడుకుని వెళ్తున్న పరిస్థితి వచ్చింది.

దూరంగా..

గతంలో జిల్లాలో స్టేట్‌, నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్లు విరివిగా నిర్వహించేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమేర నిధులను విడుదల చేయగా, దాతల నుంచి సేకరించి పోటీలు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో జిల్లాలో ఎప్పుడూ స్టేట్‌, నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించిన పరిస్థితి లేదు. క్రీడా పరికరాలు కూడా సరిపడా లేవు. మైనర్‌ ఖర్చులకు కూడా శాప్‌ నుంచే నిధులు రావాల్సి ఉంటుంది. సరిపడా కోచ్‌లు, పరికరాలు లేకపోవడంతో స్టేడియానికి క్రీడాకారుల రాక తగ్గిపోయింది. మైదానాన్ని చదును చేయాలన్నా దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. గతంలో చిన్నచిన్న పనులకు కలెక్టర్‌ నిధులు మంజూరు చేసే వారు. ఇప్పుడు అలా లేదు.

ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

శిలాఫలకాలకే పరిమితం

2012వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 10 గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా స్టేడియాల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. ఒక్కొక్కటి నిర్మాణానికి రూ.2.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. స్టేడియం ఏర్పాటుకు భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. 2016లో క్రీడా వికాస కేంద్రాలను ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు (విడవలూరు), కావలి, గూడూరు (కోట) ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో దానికి రూ.2 కోట్లు కేటాయించారు. అయితే ఎక్కడా నిర్మాణాలను పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే లేదు. ఆత్మకూరు, కోవూరు ప్రాంతాల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. క్రీడా అకాడమీని మొదలుపెట్టాలని ప్రాధికార సంస్థ అధికారులు 2025లో ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. దీనిపై అడుగు ముందుకు పడలేదు.

రెండేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం

ఏసీ స్టేడియంలో కోచ్‌ల కొరత

అరకొరగానే స్పోర్ట్స్‌ మెటీరియల్‌

స్టేట్‌, జాతీయ స్పోర్ట్స్‌ మీట్లకు దూరం

గత ప్రభుత్వ హయాంలో జోరుగా ఆడుదాం ఆంధ్రా

ఒకప్పుడు నిత్యం క్రీడాకారులతో కళకళలాడిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కూటమి ప్రభుత్వంలో కళ విహీనంగా మారింది. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సరిపడా కోచ్‌లు లేరు. గతంలో నిత్యం రాష్ట్ర, జాతీయ స్పోర్ట్స్‌ మీట్లు జరిగేవి. పలు క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు క్రీడాకారులు పోటీ పడేవారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో పోటీలు జరిపి ప్రోత్సహించారు. రెండేళ్లుగా క్రీడలు కనుమరుగయ్యాయి.

అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు

రాష్ట్ర స్థాయి బీచ్‌ ఫుట్‌బాల్‌ పోటీలు ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించనున్నారు. క్రీడా అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. దీనిపై శాప్‌ అధికారులు విజిట్‌ చేశారు. ప్రస్తుతం క్రీడా మెటీరియల్‌ ఉంది. కోచ్‌లను నియమించాలని ప్రతిపాదనలు పంపాం. ఈ విషయంశాప్‌ పరిశీలనలో ఉంది. ఈనెలాఖరు వరకు సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో దాదాపు 60 క్యాంపులు ఉంటాయి. సమ్మర్‌ క్యాంపులకు మెటీరియల్‌ కోసం నెల క్రితం ఇండెంట్‌ పంపించాం. శాప్‌ నుంచి నిధులు కేటాయించనున్నారు.

– ఎస్‌కే జసీమ్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి

Advertisement
 
Advertisement
Advertisement