సీసీటీఎన్‌ఎస్‌ డేటా ఎంట్రీపై ఎస్పీ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సీసీటీఎన్‌ఎస్‌ డేటా ఎంట్రీపై ఎస్పీ సమీక్ష

May 2 2026 11:37 AM | Updated on May 2 2026 11:37 AM

నెల్లూరు(క్రైమ్‌): స్మార్ట్‌ పోలీసింగ్‌లో భాగంగా సీసీటీఎన్‌ఎస్‌ డేటా ఎంట్రీ పనితీరుపై ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో పోలీస్‌స్టేషన్ల రైటర్లు, సీసీటీఎన్‌ఎస్‌ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్‌లో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. సమాచార నమోదులో నిర్లక్ష్యం, తప్పులు జరిగితే జిల్లా ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు మంచి ర్యాంక్‌ వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పైఅధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఉత్తమ పనితీరు చూపిన సిబ్బందిని అభినందించారు. ప్రతినెలా పనితీరు ఆధారంగా రివార్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, డీసీఆర్‌బీ, పీసీఆర్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, స్టేషన్‌ రైటర్లు, సీసీటీఎన్‌ఎస్‌ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని

వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): కుటుంబ కలహాలో?, ఆర్థిక ఇబ్బందులో?, అనారోగ్యమో మరే ఇతర కారణమో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెం గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. పింక్‌ రంగు ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్కా, పాచి రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైల్లోంచి పడి..

గుర్తుతెలియని వ్యక్తి మృతి

కొడవలూరు: రైల్లోంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య 179 కి.మీ వద్ద శుక్రవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మూడో రైల్వే ట్రాక్‌ పక్కన పడమర వైపు మృతదేహం ఉంది. శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా రైల్లోంచి పడి చనిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు రైల్వే ఎస్సై కె.వెంకట్రావు తెలిపారు. వయస్సు 40 – 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. బ్లూ కలర్‌ కట్‌ బనియన్‌, బ్లూ కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 92475 75630 ఫోన్‌ నంబర్‌కు తెలియజేయాలని రైల్వే ఎస్సై కోరారు.

కల్యాణం.. కమనీయం

రాపూరు: పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణోత్సవం రమణీయంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 9:50 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, పల్లకిలో కొలువుదీర్చి కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం పుష్పయాగం చేశారు. కాగా ఈ ముహూర్తానికి పలు నూతన జంటలు కోనలో ఒక్కటయ్యాయి.

● బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి ఉభయనాంచారులతో రఽథంపై కొలువుదీరి, కోన తిరువీధుల్లో ఊరేగారు. అలాగే స్వామి గజ వాహనంపై కోన మాడవీధుల్లో విహరించారు. ఏకాంతసేవ నిర్వహించారు.

● శనివారం ఉదయం 7 గంటలకు వసంతోత్సవం, 9 గంటలకు చక్రస్నానం, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 9 గంటలకు అశ్వ వాహనసేవ, 11 గంటలకు ధ్వజావరోహణం జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement