వ్యసనాలకు బానిసై దొంగతనాలు | - | Sakshi
Sakshi News home page

వ్యసనాలకు బానిసై దొంగతనాలు

May 2 2026 11:37 AM | Updated on May 2 2026 11:37 AM

నిందితుడి అరెస్ట్‌

రూ.8 లక్షల విలువైన

బంగారు ఆభరణాల స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): మహిళల బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష తన కార్యాలయంలో సంతపేట ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్యతో కలిసి నిందితుడి వివరాలను వెల్లడించారు. నెల్లూరులోని రెండు ప్రాంతాల్లో నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ సోమయ్య పర్యవేక్షణలో ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి పాతనేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం సమీపంలో కోటమిట్ట మెక్లిన్స్‌రోడ్డు ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు సయ్యద్‌ అతిక్‌ అర్బాస్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చోరీలిలా..

విచారణలో గతేడాది ఏప్రిల్లో రంగనాయకులపేట గొల్లవీధిలో ఇంటి తలుపు తెరిచి నిద్రిస్తున్న సునందమ్మ మెడలోని రెండు సవర్ల బంగారు ఆభరణాలు, మే నెలలో సంతపేట కొండూరువారి వీధిలో ఇంటి మేడపై నిద్రపోతున్న ఇందిరా మెడలోని రెండు సవర్ల బంగారు గొలుసు, ఈ ఏడాది ఏప్రిల్‌ 15వ తేదీన మహిళా ప్రాంగణం సమీపాన రామచంద్రారెడ్డినగర్‌లో ఇంటి తలుపులు తెరిచి నిద్రిస్తున్న యశోద మెడలో 18 గ్రాముల బంగారు సరుడు, 26వ తేదీన మెక్లిన్స్‌ రోడ్డులో ఇంటి తలుపులు తెరిచి నిద్రిస్తున్న తురక వెంకటరమణమ్మ మెడలోని ఆరుగ్రాముల తాళిబొట్టు, గుండ్లు, కాసులను అపహరించినట్లు బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి రూ.8 లక్షల విలువైన 56 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిపై కోవూరు, నవాబుపేట పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయని చెప్పారు.

సులభ మార్గంలో..

నిందితుడు గతంలో బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. చెడువ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడి సులభ మార్గంలో డబ్బు సంపాదించేందుకు దొంగగా మారాడని ఏఎస్పీ తెలిపారు. రాత్రివేళల్లో తిరుగుతూ తలుపులు తెరిచి, మిద్దెలపై నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు అపహరించి వాటిని కరిగించి కడ్డీలుగా మార్చి అమ్మి సొమ్ము చేసుకునేవాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలు బాలకృష్ణ, అనిల్‌రెడ్డి, సిబ్బందిని దీక్ష అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement