● ప్రైవేట్ స్థలంలో నిర్మాణం
● దళితులకు గుక్కెడు నీళ్లిచ్చేందుకు రాజకీయాలు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని తాళ్లపూడిలో దళితులకు మంచినీటిని అందజేసేందుకు వీపీఆర్ నిర్మించిన ఆర్‌ఓ ప్లాంట్ చుట్టూ రాజకీయాలు రాజుకున్నాయి. అధికారమే అండగా ప్లాంట్ ప్రభుత్వ స్థలంలో ఉందని, అందువల్ల పంచాయతీ నిర్వహిస్తుందని ఏప్రిల్ 24వ తేదీన తీర్మానం చేశారు. అయితే ప్రభుత్వ స్థలంలో లేదని తమ స్థలంలో ఉందని మెట్టా కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తీర్మానంపై కోర్టు స్టే విధించింది. ప్లాంట్ ప్రభుత్వ స్థలంలో నిర్మించినట్టు తహసీల్దార్ నిర్ధారించారని పంచాయతీ సెక్రటరీ తీర్మానంలో సూచించారు. కాగా గ్రామ ఎస్సీలు ఈ ప్లాంట్‌పై ఆధారపడ్డారు. వారికి న్యాయం జరగదనే ఉద్ధేశంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్లాంట్‌పై పెత్తనం చెలాయించి దళితులకు మంచినీటిని ఎగ్గొట్టే పన్నాగానికి బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి తాళ్లపూడి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కొందరు ఎస్సీ కాలనీకి చెందిన వారు టీడీపీకి ఓటేయలేదని చెప్పడంతో ప్లాంట్‌కు ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామంపై రాజకీయాలు సృష్టించి వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పులు చేసినట్టుగా ఆరోపించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వాస్తవాలను వెల్లడించి వారి ఆరోపణలను తిప్పికొట్టారు.


