● నిలువనీడ కోల్పోయిన కుటుంబం
వరికుంటపాడు: మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో యసారుపు లక్ష్మమ్మకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం నిలువనీడ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అలాగే విద్యుత్ లైన్లను తొలగించి, కొంతమేర సామగ్రిని బయటకు తీసేందుకు సహకరించారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పేదరికంలో జీవిస్తున్న ఈ కుటుంబానికి ఇల్లు లేకపోవడంతోపాటు సాగు భూమి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇంటి స్థలం కేటాయించాలని బాధిత కుటుంబం కోరింది.


