బాలికా విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమనే మహోన్నత ఆశయంతో దివంగత పొణకా కనకమ్మ అడుగులేశారు. ఆమె చొరవ పుణ్యమానని నగరంలో పొణకా కనకమ్మ కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరిట స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేద పిల్లలకు ఉచితంగా విద్యను బోధిస్తూ ఎంతో మందికి ఆసరాగా నిలిచారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఈ ప్రాంగణంలో గత విద్యా సంవత్సరంలో జీవీకే సీబీఎస్‌ఈ స్కూల్‌ను ఏర్పాటు చేసి.. బాలికలకు మాత్రమే
ప్రవేశమని ప్రకటించారు. అయితే దీనికి విరుద్ధంగా కమిటీ మెంబర్లు వ్యవహరిస్తున్నారు. భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేయనుండటమే కాకుండా రానున్న
అకడమిక్ ఇయర్ నుంచి కో ఎడ్యుకేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
కస్తూరిదేవి విద్యాలయ ఆస్తులను పరిరక్షించాలి. బాలికలకు ఉచిత విద్య కోసం నెలకొల్పిన దీని ప్రాంగణంలో కార్పొరేట్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం దుర్మార్గం. పొణకా కనకమ్మ ఆశయ సాధనకు అనుగుణంగా బాలికలకు ఉచిత విద్యనందించాలి. జీవీకే స్కూల్‌కు అనుమతులిచ్చిన జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులపై చర్యలు చేపట్టాలి.
– సురేంద్రనాథ్‌రెడ్డి, కన్వీనర్, పొణకా కనకమ్మ ఆశయసాధన సమితి
నెల్లూరు(టౌన్): ధనదాహంతో జీవీకే వ్యవహరిస్తూ.. పొణకా కనకమ్మ ఆశయానికి తూట్లు పొడుస్తోంది. బాలికలకు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యానికి మంగళం పాడుతోంది. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గర్ల్స్‌కు ఫ్రీ ఎడ్యుకేషన్‌ను అందించేందుకు గానూ ఏర్పాటు చేసిన కస్తూరిదేవి విద్యాలయ కమిటీ ప్రాంగణంలో కార్పొరేట్ స్కూల్‌ను ఏర్పాటు చేయడంపై నెల్లూరు ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఆస్తుల పరిరక్షణ కోసం గతంలో ఉద్యమం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ పరిణామాలపై ప్రస్తుతం మౌనంగా ఉండడం చర్చకు దారితీస్తోంది.
103 ఏళ్ల క్రితమే..
బాలికలకు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడికి చెందిన పొణకా కనకమ్మ.. 1923లో పొగతోటలో 2.4 ఎకరాల్లో కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరిట స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం సదరు స్థలంతో పాటు మరో రూ.20 వేలను రేబాల కుటుంబానికిచ్చి, దర్గామిట్టలో 21.81 ఎకరాలను కస్తూరిదేవి విద్యాలయ కమిటీకి బదలాయించారు. అప్పట్లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఆయన మరణానంతరం కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన జక్కా వెంకటరామిరెడ్డి 1998లో జీవీకే రెడ్డిని కమిటీలోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. కాలక్రమంలో కమిటీకి అధ్యక్షుడైన ఆయన.. దొడ్ల శేషారెడ్డిని సెక్రటరీ, కరస్పాండెంట్‌గా నియమించారు.
రెండేళ్ల క్రితం జీవీకే స్కూల్ ఏర్పాటు
కస్తూరిదేవి విద్యాలయ కమిటీ ప్రాంగణంలోని నాలుగెకరాల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో జీవీకే ఇంటర్నేషనల్ సీబీఎస్‌ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. నర్సరీ, పీపీ – 1, 2తో పాటు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అనుమతి పొందారు. ఆపై పదో తరగతి వరకు పర్మిషన్ తెచ్చుకున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. గత విద్యా సంవత్సరంలో బాలికలకే అడ్మిషన్లు ఇచ్చారు. అయితే రానున్న అకడమిక్ ఇయర్ నుంచి కో ఎడ్యుకేషన్ కింద నిర్వహించనున్నామంటూ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీనికి గానూ జిల్లా విద్యాశాఖకు ఐదు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.
డాక్యుమెంటేషన్ మేరకే అనుమతులు
జీవీకే స్కూల్‌ను ఎంఈఓ తనిఖీ చేశారు. పాఠశాలను ఏర్పాటు చేసేందుకు మేనేజ్‌మెంట్ కమిటీ రెజల్యూషన్ చేసింది. అన్ని పత్రాలను అధికారులకు పంపాం. కో ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
– బాలాజీరావు, డీఈఓ
విద్యాలయ ఆస్తులను పరిరక్షించాలి
బాలికల ఉచిత విద్యకు మంగళం
రూ.లక్షల్లో వసూళ్లు
పొణకా కనకమ్మ ఆశయానికి తూట్లు
ఏడాది క్రితం నాలుగెకరాల్లో జీవీకే గర్ల్స్ సీబీఎస్‌ఈ స్కూల్ ఏర్పాటు
ఈ విద్యా సంవత్సరం నుంచి
కో ఎడ్యుకేషన్‌కు నోటిఫికేషన్
మౌనవ్రతం దాల్చిన రూరల్ ఎమ్మెల్యే
బాలికలకు ఉచిత విద్యను అందించాల్సిన కమిటీ సభ్యులు దానికి విరుద్ధంగా ఫీజుల వసూళ్ల పర్వానికి తెరలేపారు. రూ.62 వేల నుంచి రూ.లక్ష వరకు గుంజుతున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో దీన్ని పెంచే అవకాశముందని సమాచారం. మరోవైపు ఈ పరిణామాలపై జిల్లాలోని పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. అందరూ కలిసి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానిస్తు న్నారు. ఇంత జరుగుతున్నా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మౌనవ్రతం దాల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన ఉద్యమించిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. జీవీకే స్కూల్లో వసూలు చేస్తున్న ఫీజులకు వ్యతిరేకంగా.. పేద పిల్లలు చదువుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


