నెల్లూరు(బారకాసు): నెల్లూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎం కిరణ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నగరంలోని మెప్మా కార్యాలయంలో శుక్రవారం ఆయన పీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కడప మెప్మా పీడీగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు మెప్మా పీడీగా నియమితులయ్యారు. కడప మెప్మా ఇన్‌చార్జి పీడీగా కూడా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు మెప్మా పీడీ, ఇన్‌చార్జి డీఎస్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న లీలారాణి రిలీవ్ అయ్యారు. ఈమెకు ప్రస్తుతం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
13న జెడ్పీ స్థాయీ
సంఘాల సమావేశాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలను ఈ నెల 13న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతాయని చెప్పారు. జెడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశాలకు జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు.
డీసెట్ దరఖాస్తు
గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం కోసం నిర్వహించే డీసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మరికొన్ని డీఎల్‌ఈడీ కళాశాలలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల డీసెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పొడిగించినట్లుగా తెలిపారు. పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in,https://apdee.cet.apcfss.in వెబ్‌సైట్‌లను సంప్రదించాలని సూచించారు.
నేత్రపర్వంగా ప్రసన్న
విశ్వేశ్వరుని కల్యాణం
ఇందుకూరుపేట: మండలంలోని మైపాడులోని అన్నపూర్ణాంబ సమేత ప్రసన్న విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బండారు ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో ఆదిదంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించి తన్మయం చెందారు. అనంతరం గజ వాహనంపై ఆదిదంపతులను కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. కల్యాణోత్సవానికి ఉభయకర్తలుగా గంపల రామసుబ్బయ్య జ్ఞాపకార్థంగా కుటుంబసభ్యులు వ్యవహరించారు.
91.32 శాతం మందికి పింఛన్ల పంపిణీ
నెల్లూరు(పొగతోట): సామాజిక పింఛన్ల నగదు పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 2,88,093 మంది లబ్ధిదారులు ఉండగా, తొలిరోజు 2,63,087 మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పర్యటించి పింఛన్ లబ్ధిదారులకు నగదు అందజేసి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.


