రాష్ట్రంలోనే పెట్రో కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోనే పెట్రో కష్టాలు

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

పొదలకూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని పొదలకూరు, నేదురుమల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. డీజిల్‌ లభ్యం కాక పంటల సాగులో దుక్కి దున్నకాలకు ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆయన ఎదుట ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంలేదని తెలియజేశారు. తమ ప్రాంతంలో చుక్కల భూముల సమస్యను నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఇది మళ్లీ మొదటికొచ్చిందని వాపోయారు. ఏ ఒక్క పథకాన్నీ సక్రమంగా అమలు చేయడంలేదని తెలియజేశారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే..

చంద్రబాబు వైఫల్యంతోనే పెట్రోల్‌, డీజిల్‌కు కొరత ఏర్పడిందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవముందని.. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరిస్తానంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప చంద్రబాబుతో ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. తల్లికి వందనం పేరిట ప్రతి బిడ్డకూ రూ.15 వేల చొప్పున అందజేస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించి.. తల్లులను ప్రస్తుతం నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక కొత్తగా పింఛన్లను మంజూరు చేసిన దాఖలాల్లేవని చెప్పారు.

మళ్లీ చుక్కల భూముల సమస్యలు

తమ ప్రభుత్వ హయాంలో చుక్కల భూములకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కారాన్ని చూపి పట్టా భూములుగా మార్చి రైతులకు అందజేశారని, అయితే ఆయనకు పేరొస్తుందనే దురుద్దేశంతో సమస్యను కూటమి ప్రభుత్వం మళ్లీ మొదటికి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తే, తిరిగి వాటిని సృష్టించి తప్పుడు కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో భూ వివాదాలను సృష్టించి రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కూటమిపై వ్యతిరేకత బాగా పెరిగిందని వెల్లడించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటుందని తెలిపారు. వీరికి ఎలాంటి సమస్యొచ్చినా ముందుందేది తామేనని స్పష్టం చేశారు. అనంతరం పొదలకూరు కల్యాణ మండపంలో ఎస్సీ సెల్‌ నేత పెంచలప్రసాద్‌, సుభాషిణి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. నేదురుమల్లిలో ప్రమాదవశాత్తూ వన్నం హరీష్‌ మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజద్‌, వేణుగోపాల్‌రెడ్డి, వాకాటి శివప్రసాద్‌రెడ్డి, ఉడతా రమేష్‌, పెంచలనాయుడు, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలనలో

కన్నీరు పెడుతున్న పల్లెలు

రెండో కారు పంటల సాగుకు కష్టాలు

ధ్వజమెత్తిన మాజీ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement