‘పది’ ఫలితాల విడుదల నేడు | - | Sakshi
Sakshi News home page

‘పది’ ఫలితాల విడుదల నేడు

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

నెల్లూరు (టౌన్‌): పదో తరగతి ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. results.bse.ap. gov.in, మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 95523 00009, లీప్‌ మొబైల్‌ యాప్‌, డిజీ లాకర్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని వివరించారు.

మాఫియాలతో పాలనను సాగించలేరు

చిల్లకూరు: రాష్ట్రంలో మాఫియాలతో పాలనను కొనసాగించలేరని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే ప్రజలు తిరుగుబాటు చేయాల్సి వస్తుందని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వ్యక్తిగత కారణలతో హాజరైన ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో విలేకరులతో బుధవారం మాట్లాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేసి హతమారుస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా వీ కోట వద్ద ఓ విలేకరిని హత్య చేయడాన్ని కిరాతక చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొమ్మి నారాయణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్‌, జమాలుల్లా, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు.

అధునాతన స్పీడ్‌ బోట్ల తయారీకి శ్రీకారం

ముత్తుకూరు (పొదలకూరు): సముద్రంలో చేపల అక్రమ వేటను నిరోధించడంలో భాగంగా అధునాతన స్పీడ్‌ బోట్లను తయారు చేసేందుకు గానూ రూ.30 లక్షలను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ముందస్తుగా విడుదల చేశారు. దీంతో పనులకు శ్రీకారం చుడుతూ పూజా కార్యక్రమాలను మత్స్యకారులు బుధవారం నిర్వహించారు. తమిళనాడులోని నాగపట్నం వద్ద ఉన్న పీఎస్‌ స్టీల్‌ బోట్‌ పనులను పరిశీలించి రెండు స్టీల్‌ బాడీ డీప్‌సీ ఫిషింగ్‌ నౌకలు (అధిక వేగం కలిగిన 650 హెచ్‌పీ)ను తయారు చేసేందుకు దక్షిణ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు సిద్ధమయ్యారు. మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ

నెల్లూరు (లీగల్‌): జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వాణిని విజయవాడ మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మను ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు బుధవారం జారీ చేసింది.

శ్రీవారి దర్శనానికి

16 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 68,980 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,511 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.09 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

భూముల పరిశీలన

దుత్తలూరు: మండలంలోని ముత్తరాశిపల్లి, రాఘవరెడ్డిపల్లి గ్రామ సమీపాల్లో ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ పరిశ్రమకు కేటాయించిన భూములను ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శివకుమార్‌ బుధవారం పరిశీలించారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల స్థావనతో మెట్ట ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నామని వెల్లడించారు. తహసీల్దార్‌ యనమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement