● విజృంభిస్తున్న మాఫియా
● గుంతలమయమైన ఐటీఐ స్థలం
● రూపు కోల్పోతున్న సంగం కొండ
● రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సంగం: సంగంలోని గ్రావెల్‌ను సమీప మండలాలకు తరలిస్తూ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో భారీగా లేఅవుట్లను వేస్తుండటం వీరికి ఆదాయ వనరుగా మారింది. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ భారీగా దోచుకుంటున్నారు. సంగం కొండ, తిరుమన తిప్ప కొండను కొల్లగొడుతున్నారు. మండలంలోని బడా నేతలు చికెన్ వ్యర్థాల మాఫియాగా ఏర్పడగా.. చోటా నేతలు గ్రావెల్ మాఫియాగా మారి సొమ్ము చేసుకుంటున్నారు.
యంత్రాలతో రేయింబవళ్లూ..
సంగం తిరుమనతిప్పలోని సర్వే నంబర్ 252లో 5.4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించారు. అయితే దీన్ని చేపట్టకపోవడంతో కొంతకాలం ఆత్మకూరులో నిర్వహించారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో సంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని లగడపాటి రాజగోపాల్ ఫౌండేషన్ వద్ద ప్రస్తుతం జరుపుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మేలురకం గ్రావెల్ ఉండటంతో టీడీపీ చోటా నేతల కన్ను దీనిపై పడింది. దీంతో ఇక్కడ యంత్రాలను పెట్టి రేయింబవళ్లూ తరలిస్తున్నారు. సంగం తిప్ప బీరాపేరు వైపు, కొరిమెర్ల పంపింగ్ స్కీమ్ సమీపంలోని తిప్పను సైతం కొల్లగొడుతున్నారు. దీంతో గుంతలు ఏర్పడి రూపు కోల్పోతోంది. వేసవిలో మూగజీవాలు తిరిగేందుకు సైతం ఈ గుంతలు అవరోధంగా మారడంతో పలు సందర్భాల్లో సంగంలోకి వస్తున్నాయి. మాఫియా ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నా, అడ్డుకోవడంలో అధికారులు మీనమేషాలను లెక్కిస్తున్నారు.
ట్రాక్టర్‌లో గ్రావెల్ తరలింపు
ఐటీఐ కళాశాల స్థలంలో ఏర్పడిన భారీ గుంతలు
చర్యలు చేపడతాం
గ్రావెల్ తరలింపుపై విచారణ జరిపి చర్యలు చేపడతాం. రెవెన్యూ, మైనింగ్ అనుమతుల్లేకుండా గ్రావెల్‌ను తరలించడం నేరం. – వెంకటేశ్వర్లు,
ఇన్‌చార్జి తహసీల్దార్


