హామీ ఇచ్చారు.. విస్మరించారు..!
నెల్లూరు(టౌన్): న్యాయవాద పరీక్షలకు కొందరు కళంకం తీసుకొస్తున్నారు. చీటీలతో ఎంచక్కా పరీక్షలు రాస్తూ.. నిర్వహణ విధానంపైనే అనుమానాలొచ్చేలా వ్యవహరిస్తున్నారు. టెస్టుల పర్యవేక్షణకు ఓ వైపు ఇన్విజిలేటర్లు.. మరోవైపు అబ్జర్వర్లు, హైపవర్ కమిటీ అధికారులను నియమించినా, మాస్ కాపీయింగ్‌పై ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. నామమాత్రంగా ఽవిధులు నిర్వర్తిస్తూ, ఈ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. కళాశాలకు చెందిన అధికారులు సైతం సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవహారం బట్టబయలు
తాజాగా పరీక్ష కేంద్రాన్ని వీఎస్‌యూ వీసీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ క్రమంలో చీటీలు, పుస్తకాలు పెట్టి రాస్తూ పది మంది గురువారం.. తొమ్మిది మంది శుక్రవారం పట్టుబడ్డారు. వీరిని హైపవర్ కమిటీ అధికారులకు అప్పగించారు. జవాబు పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఇదే తరహాలో వ్యవహరిస్తున్న కొందరు ముందే జాగ్రత్తపడి వాటిని బయట విసిరేశారని తెలుస్తోంది.
నిద్రమత్తులో జోగుతూ..
పరీక్షలను పక్కాగా నిర్వహించాల్సిన వీఎస్‌యూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీజీ, యూజీ పరీక్షలను సైతం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. వాస్తవానికి అడిషనల్ కంట్రోలర్‌గా అనుభవజ్ఞులకు బాధ్యతలను అప్పగించాల్సి ఉంది. అయితే యూజీ, పీజీ విభాగాన్ని చూస్తున్న అడిషనల్ కంట్రోలర్లకు ఎలాంటి అనుభవం లేదని సమాచారం. ఎగ్జామ్స్ పర్యవేక్షణ మొదలుకొని ఫలితాల ప్రకటన, సర్టిఫికెట్ల ముద్రణ వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
దృష్టంతా చీటీలు, పుస్తకాలపైనే..
లా పరీక్షల్లో జోరుగా
మాస్ కాపీయింగ్
వీఎస్‌యూ వీసీ ఆకస్మిక
తనిఖీల్లో బట్టబయలు
చీటీలు చూసి రాస్తూ పట్టుబడిన 19 మంది
వీరిపై చర్యలకు ఆదేశం
తూతూమంత్రంగా ఇన్విజిలేటర్లు, హైపవర్ కమిటీ అధికారుల విధులు
లోపభూయిష్టంగా సెమిస్టర్
పరీక్షల నిర్వహణ
అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లలోనూ తప్పులు దొర్లాయి. ఈ విభాగంపై వీసీ సైతం పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదని సమాచారం. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగంపై అనేక ఫిర్యాదులు రావడంతో.. ప్రక్షాళన చేస్తానని వీసీ హామీ ఇచ్చి ఏడాదైనా నేటికీ అతీగతీ లేకపోవడం గమనార్హం. మాస్ కాపీయింగ్‌పై ఉక్కుపాదం మోపి కష్టపడి చదివిన విద్యార్థులే లా పట్టా అందుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భవిష్యత్తులో న్యాయం, ధర్మాన్ని పరిరక్షించాల్సిన న్యాయ విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి చదివి న్యాయవాద పట్టాను అందుకోవాల్సిన కొందరు అక్రమ బాటలో పయనిస్తున్నారు. చేతినిండా చీటీలు పెట్టుకొని పరీక్ష రాస్తూ పట్టుబడటం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. కళాశాలకు వెళ్లకపోయినా.. కష్టపడి చదువుకోకపోయినా.. ఎంచక్కా పట్టా అందుకోవచ్చనే దురాలోచనతో వీరు అక్రమ మార్గాల్లో పయనిస్తూ కళంకం తెస్తున్నారు. వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 19 మందికిపైగా స్టూడెంట్స్‌ను పట్టుకున్నారంటే లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థమవుతోంది.
చదివిన వారికే డిగ్రీ అందాలి
కష్టపడి చదివిన విద్యార్థే ఏ డిగ్రీనైనా అందుకోవాలి. మాస్ కాపీయింగ్‌పై ఉక్కుపాదం మోపుతాం. చీటీలు, పుస్తకాలు పెట్టి రాసే వారిని ఉపేక్షించేదిలేదు. భవిష్యత్తులో మరిన్ని తనిఖీలు చేస్తా. వర్సిటీ పరిధిలో ఏ పరీక్షలనైనా పక్కాగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేస్తాం.
– అల్లం శ్రీనివాసరావు, వీసీ, వీఎస్‌యూ
నగరంలోని వీఆర్ న్యాయ కళాశాలలో మూడు, ఐదేళ్లకు సంబంధించిన లా కోర్సులున్నాయి. మూడేళ్ల కోర్సులో ఏడాదికి 330 మంది చొప్పున 990 మంది.. ఐదేళ్లకు సంబంధించి సంవత్సరానికి 112 మంది చొప్పున 560 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి వరుసగా మొదటి.. ఆరు.. పదో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటిని మద్రాస్ బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఐపీఎస్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మందికిపైగా హాజరవుతున్నారు. అయితే ఇక్కడే అసలు గమ్మత్తు వెలుగు చూసింది. ఇక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతున్నా, విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, హైపవర్ కమిటీ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇదే అంశమై గతంలోనే కథనాలు ప్రచురితమైనా, వారిలో ఏ మాత్రం చలనం లేదు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఈ కళాశాలలో ఎక్కువ మంది ఉన్నారు.
హామీ ఇచ్చారు.. విస్మరించారు..!


