బాధితులను పరామర్శించడం నేరమా..?
● అక్రమ కేసులకు భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షిప్రతినిధి నెల్లూరు: అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జిల్లా పోలీసులు ఏకపక్షంగా అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కోవూరు పోలీస్‌స్టేషన్లో నమోదైన అక్రమ కేసుకు సంబంధించి మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విచారణకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం హాజరయ్యారు. పోలీసుల విచారణ అనంతరం కాకాణి మాట్లాడారు. కోవూరులో బాలికపై జరిగిన దారుణాన్ని ఖండించడం నేరమా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పాపమానని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పోక్సో చట్టంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, బాలిక వివరాలను తామెక్కడా వెల్లడించలేదని గుర్తుచేశారు. మీడియా సమావేశాన్ని సైతం నిర్వహించలేదన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించి తిరిగెళ్తుండగా, కొద్ది దూరంలో కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పానని, అయితే కొన్ని పచ్చ మీడియా ఛానళ్లు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. బాలికకు సరైన చికిత్సను అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నే మీడియా ఎదుట ప్రస్తావించానని తెలిపారు. దీంతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి నోటీసులను మూడుసార్లు ఇచ్చారని చెప్పారు. విచారణ సందర్భంగా సంబంధంలేని ప్రశ్నలను పోలీసులు సంధించారని చెప్పారు. 25 ప్రశ్నలు కాదు.. 2500 వేసినా సమాధానం చెప్పే దమ్ముందని స్పష్టం చేశారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తానని తెలిపారు.
టీడీపీ నేతలకు నోటీసులు ఎందుకివ్వలేదు..?
గంజాయితో బాలికపై దారుణం జరిగిందని, దీన్ని అరికడతామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు చైర్మన్ వ్యాఖ్యానించిన అంశాన్ని ప్రస్తావించారు. అయితే వీరికి నోటీసులను ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. గంజాయిని అరికట్టి ప్రజలకు సుపరిపాలనను టీడీపీ ప్రభుత్వం అందించాల్సింది పోయి.. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. బాలికపై జరిగిన ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని, తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, తనపై ఇలాంటి అక్రమ కేసులెన్ని పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని మానుకునే ప్రసక్తేలేదన్నారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని, వారికి అండగా నిలిచి పోరాడతామని ప్రకటించారు.
పోలీసుల తీరు హేయం..
జిల్లాలో తమ పార్టీని అడ్డుకునేందుకు అధికార పార్టీ ముందుకు రావడంలేదని, పోలీసులే ఈ పాత్రను పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తాము ఎన్నికల్లో పోటీ చేసినా, అందుకు వీల్లేదంటూ నోటీసులను జారీ చేస్తారేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఓర్వలేకే.. పచ్చ మీడియా కథనాలు
నెల్లూరు పర్యటనకు మాజీ సీఎం, తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వచ్చారని, ఆయన్ను చూసేందుకు అశేష జనవాహిని కదిలొచ్చిందని చెప్పారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక కడుపు మంటతో.. పెళ్లికొస్తే ఇంత భారీ జనం అవసరమా అంటూ పచ్చమీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయనెక్కడ పర్యటించినా, ప్రజలు భారీగా తరలివచ్చి.. తమ బిడ్డగా భావిస్తారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన నేత జగన్‌మోహన్‌రెడ్డి అని.. పరిపాలన చేతకాకపోతే ఆయన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
బాధితులను పరామర్శించడం నేరమా..?


