జగనన్నను మరోసారి సీఎం చేద్దాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● పార్టీ నెల్లూరు నగర కార్యకర్తలతో విస్త్తృత స్థాయి సమావేశం
నెల్లూరు రూరల్: జగనన్న 2.0లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారని, శ్రేణులు మరింత కష్టించి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని జీపీఆర్ కల్యాణ మండపంలో పార్టీ నెల్లూరు నగర కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. దీనికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, నగర పరిశీలకుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించనున్నామని వివరించారు. గ్రామస్థాయి కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులిచ్చి, సముచిత స్థానాన్ని కల్పిస్తామని వెల్లడించారు. తమ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసిన వారిని భవిష్యత్తులో వదిలేదిలేదని స్పష్టం చేశారు. అబద్ధానికి, అన్యాయానికి, మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్నికలెప్పుడు జరిగినా, నగరంలో పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయమని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ హామీనీ అమలు చేయడంలేదని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి ఊసే కనిపించడంలేదని, కూటమి పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. 2029లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. వలంటీర్ల ద్వారా పింఛన్లను గతంలో అందజేసేవారని గుర్తుచేశారు. కష్టకాలంలోనూ పార్టీలో ఉన్న వారే జగనన్న సైనికులని, వీరికి రానున్న రోజుల్లో పెద్దపీటేస్తామని వెల్లడించారు.
వెనుకడుగేయడంలేదు..
ఓటమి తర్వాత కార్యకర్తలు నెలల్లోనే చురుగ్గా పనిచేయడం చిన్న విషయం కాదని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది కార్యకర్తలను గుర్తించి ఐడీ కార్డులను ఏప్రిల్లో అందజేయనున్నామని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నా, తమ పార్టీ శ్రేణులు వెనుకడుగేయడంలేదని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునే విషయంలో ఎంత దూరమైనా వెళ్తామన్నారు. టీడీపీకి అధికారాన్ని ప్రజలు కట్టబెడితే, దాన్ని విస్మరించి తమ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు జిల్లాలో కాకాణి సారథ్యంలో పోరాడతామని ప్రకటించారు.
అక్రమ కేసులు తప్ప ఇంకేమీలేవు..
అక్రమ కేసులు, దౌర్జన్యాలు, హత్యలు తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో మరేవీ లేవని జంకె వెంకటరెడ్డి ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలు తప్ప ప్రజలకు ఏ మేలునూ చంద్రబాబు చేయడంలేదని ఆరోపించారు. అధికారం ఉన్నా లేకపోయినా జగనన్నతోనే తమ పయనమని ఆనం విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తలే తమ పార్టీకి బలమని చెప్పారు.


