తవ్వేకొద్దీ.. బయటపడుతున్న అక్రమాస్తులు
● ఏసీబీ సోదాల్లో నగదు, బంగారు గుర్తింపు
● రూ.కోట్లకు పడగలెత్తిన ఎఫ్‌ఏసీ తహసీల్దార్
నెల్లూరు(క్రైమ్) / బుచ్చిరెడ్డిపాళెం రూరల్: దగదర్తి తహసీల్దార్ (ఎఫ్‌ఎసీ) పాల కృష్ణ ఆదాయానికి మించి భారీగా ఆస్తులను కూడబెట్టారనే అంశం ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చింది. ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగరంలోని తెలుగుగంగ కాలనీ సమీపంలో గల విజయలక్ష్మినగర్‌లో కృష్ణ ఇంటితో పాటు స్నేహితుల నివాసాలు, బుచ్చిరెడ్డిపాళెంలోని ఆయన సోదరుడు, దగదర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో నెల్లూరు ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ రామకృష్ణుడు పర్యవేక్షణలో బృందాలు శుక్రవారం ఉదయం ఆరు నుంచి సోదాలు చేపట్టారు. తెలుగుగంగ కాలనీ సమీపంలో 33.24 అంకణాల్లో జీ + 3 స్కూల్ భవనం.. చేజర్ల మండలంలో 5.59 ఎకరాల వ్యవసాయ భూమి.. పొదలకూరు మండలం తోడేరులో 31.48 చదరపు గజాల ఇంటి స్థలం.. ఒక స్కూల్ వ్యాన్.. ద్విచక్రవాహనం.. ఇంట్లో రూ.లక్ష నగదు.. 395.36 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దగదర్తి భూముల వ్యవహారంలో పలు ఆరోపణలు ఉండటంతో ఆ దిశగా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.కోట్లల్లో ఉండొచ్చని తెలుస్తోంది. సోదాలు రాత్రి వరకు కొనసాగాయి.
2017లో డీటీగా..
బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పాల కృష్ణ 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా చేరారు. 2017లో ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికై నాయుడుపేట, గూడూరులో పనిచేశారు. సైదాపురం, వెంకటాచలం, చేజర్ల, రాపూరు మండలాల్లో తహసీల్దార్ (ఎఫ్‌ఎసీగా) విధులు నిర్వర్తించారు. దగదర్తి తహసీల్దార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సైదాపురంలో పనిచేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. దీనిపై 2022 జూలైలో ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. డిపార్ట్‌మెంటల్ ఎంకై ్వరీ పెండింగ్‌లో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సోదాల అనంతరం కృష్ణను కోర్టులో హాజరుపర్చనున్నామని చెప్పారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు విజయకుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
లీలలెన్నో..
సైదాపురం: దగదర్తి తహసీల్దార్ (ఎఫ్‌ఏసీ) కృష్ణ బాగోతాలు అన్నీ అన్నీ కావు. వాస్తవానికి గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరి సిఫార్సులతో 2022 – 23లో సైదాపురం అడ్‌హాక్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. పైసలిస్తేనే ఫైల్‌ను చక్కబెట్టేవారనే ఆరోపణలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. కంప్యూటర్ల మొదలుకొని ఇంటికి ఏసీల వరకు ఇలా ఏదీ వదలకుండా చక్కదిద్దుకున్నారనే విమర్శలూ లేకపోలేదు. భారీగా వెనుకేసుకున్న మొత్తంతో ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఓ తోటనూ కొనుగోలు చేశారని తెలుస్తోంది. గతంలో సైదాపురం తహసీల్దార్‌గా ఉన్న సమయంలో 2022, జూలై రెండు, మూడున కార్యాలయంపై ఏకకాలంలో 16 మంది ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన అక్రమాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. పలు ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ఆయన్ను బదిలీ చేశారు. మరోవైపు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 2015 నుంచి 2022 వరకు పనిచేసిన 14 మంది రెవెన్యూ అధికారులకు వివిధ కారణాలతో నోటీసులను ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం జారీ చేశారు. ఈ జాబితాలో పాల కృష్ణ పేరుంది. ఇలా ఉత్తర్వులు జారీ అయిన రెండో రోజే ఏసీబీ దాడులు జరగడం గమనార్హం.
ఏసీబీ దాడులతో కలకలం
దగదర్తి: స్థానిక తహసీల్దార్ (ఎఫ్‌ఏసీ) కృష్ణ అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో కార్యాలయంలో సోదాలను ఏసీబీ అధికారులు శుక్రవారం నిర్వహించారు. పలు రికార్డులను సీఐ వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో తనిఖీ చేశారు. భూములకు సంబంధించిన పలు రికార్డులపై డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ శివకుమార్, ఆర్‌ఐ ప్రియాంకను ప్రశ్నించారు. వెలుపోడు, విమానాశ్రయ భూముల్లో అవినీతి జరిగిందనే సమాచారంతోనే దాడులను ఏసీబీ నిర్వహించిందని తెలుస్తోంది.
తవ్వేకొద్దీ.. బయటపడుతున్న అక్రమాస్తులు


