యూరియా అడిగితే కొడతారా..?
● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
కలువాయి(సైదాపురం): పంటల సాగు నిమిత్తం యూరియాను కోరిన రైతులకు ఇవ్వకపోగా, వారిని పోలీసులు లాఠీలతో కొట్టడం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలువాయి మండలంలోని తెలుగురాయపురానికి చెందిన రైతులపై అక్రమ కేసులను బనాయించిన తరుణంలో బాధిత కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తూ తమ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. తెలుగురాయపురంలో కూటమి నేతల అరాచకాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు. యూరియా కోసం వెళ్లిన రైతులపై కక్షసాధింపులు తగవన్నారు. ఎమ్మెల్యేను ఏదో అన్నారంటూ తమ పార్టీకి చెందిన శ్రీనివాసులురెడ్డి, చిన్నపెంచలరెడ్డి, వెంకటనరసారెడ్డి, కిశోర్‌పై అక్రమ కేసులు బనాయించడం, వారిని చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా రైతులను రోజంతా పోలీస్‌స్టేషన్లో నిర్బంధించి.. అనంతరం వారిపై కేసులు నమోదు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయమని స్థానిక ఎస్సైను ప్రశ్నించగా, పైనుంచి ఒత్తిళ్లు అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీ శ్రేణుల జొలికొస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. రైతులపై కేసులను బనాయిస్తే సహించేదిలేదని, దీని కోసం ఎంత దూరానికై నా వెళ్తామని తెలిపారు. తమ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం త్వరలోనే కొలువుదీరనుందని, ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న అధికారులను వదలబోమన్నారు. పార్టీ శ్రేణులకు తానెప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


