జగనన్న 2.0లో శ్రేణులకే అధిక ప్రాధాన్యం
● 18 లక్షల మందితో సైన్యాన్ని
సిద్ధం చేస్తున్నాం
● నేతలు, కార్యకర్తలకు ఐడీ కార్డులిస్తాం
● మంచిని చెడుగా
చూపడం తప్ప బాబుకు పాలన చేతకాదు
● మాజీ మంత్రులు కాకాణి, ప్రసన్న
కొడవలూరు: రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావడం తథ్యమని, జగనన్న 2.0లో పార్టీ శ్రేణులకు తొలి ప్రాధాన్యమివ్వనున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామ కమిటీల ఎంపికలో భాగంగా నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు గానూ మండలంలోని నార్తురాజుపాళెంలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాకాణి మాట్లాడారు. గ్రామ కమిటీల ఎంపిక ద్వారా నియోజకవర్గానికి ఏడు వేల నుంచి పది వేల మంది చొప్పున రాష్ట్రంలో 18 లక్షల మందితో జగనన్న సైన్యాన్ని సిద్ధం చేయనున్నారని వెల్లడించారు. కమిటీల్లో ఎంపికై న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులను ఇవ్వనున్నామని తెలిపారు. దీంతో వీరికి గుర్తింపు, గౌరవం లభించడంతో పాటు ఎక్కడికెళ్లినా పని జరిగేలా చర్యలు చేపట్టనున్నామని చెప్పారు.
డబ్బా కొట్టుకునేందుకే పరిమితం
సీఎం చంద్రబాబుకు పరిపాలన చేతకాదని విమర్శించారు. మంచిని చెడుగా చిత్రీకరించడమే ఆయనకు తెలుసునని ధ్వజమెత్తారు. 20 లక్షల కోట్ల ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ విజయవంతమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని, అయితే ఏ పథకాన్నీ అందరికీ ఇవ్వలేదనే అంశాన్ని గుర్తుచేశారు. దీనిపై సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పింఛన్లను సైతం పచ్చ చొక్కా తొడుకున్న వారికే ఇస్తూ సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. బాబుకు ఓటు ద్వారా వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము టీడీపీ వారిని గతంలో చేర్చుకొని తప్పు చేశామని, వీరంతా తమకు గుణపాఠం చెప్పి ప్రలోభాలకు లొంగి మరోసారి అదే గూటికి చేరారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారులు కొందరు ఓ జిల్లాలో తమ పా ర్టీ వారిని చితకబాది.. మరో జిల్లాలో మన పార్టీ నేతలతో సఖ్యతగా ఉండటాన్ని చూస్తున్నామని, ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉంటామని చెప్పారు.
పార్టీకి కార్యకర్తలే బలం
జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పెద్ద పీటేయనున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. క్షేత్ర స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన వద్ద లబ్ది పొంది.. అధికారం కోల్పోయాక అవతలి పార్టీ వద్ద సూట్ కేసులు తీసుకొని ఫిరాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారే అసలైన కార్యకర్తలని పేర్కొన్నారు. ఇప్పుడు మన వెంట నడిచిన వారికి మన ప్రభుత్వం వచ్చాక అత్యంత ప్రాధాన్యమివ్వనున్నామని ప్రకటించారు. తొలుత గ్రామ కమిటీల జాబితాను కాకాణికి నేతలు అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ గాలి జ్యోతి, జెడ్పీటీసీ శ్రీలత, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరి, అత్తిపల్లి అనూప్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, షాహుల్ తదితరులు పాల్గొన్నారు.


