రీ సర్వేను పక్కాగా జరపాలి
రాపూరు: మండలంలో రీ సర్వేను పక్కాగా జరపాలని జేసీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని కండలేరు అతిథి గృహంలో రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే సమయంలో భూమి గల రైతులుండేలా చూడాలని సూచించారు. అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు.
భూముల పరిశీలన
మండలంలోని పంగిలిలో భూములను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు రూరల్ మండలంలోని దొంతాలిలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం 42 ఎకరాల అటవీ భూమిని సేకరించామని, దీనికి ప్రత్యామ్నాయంగా 84 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దీనికి గానూ మండలంలోని పంగిలిలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలిపారు. సర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నామని, ఆమోదం లభించాక ఈ భూమిని అటవీ శాఖకు అప్పగించనున్నామని వెల్లడించారు. తహసీల్దార్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


