‘కుష్టు వ్యాధి’ నయమవుతుంది!
● జిల్లాలో రోగులు 996 మంది
● నూతన కేసులు 55
● చికిత్సలో ఉన్నవారు 107 మంది
● ప్రారంభంలో గుర్తిస్తే వైకల్యానికి చెక్
● నేడు వరల్డ్ లెప్రసీ డే
నెల్లూరు(అర్బన్): కుష్టు సోకిన వారిని సమాజం వెలివేసినట్టు చూస్తోంది. ఈ జబ్బు వస్తే శరీర భాగాలు వికృతంగా తయారవుతాయి. కుష్టు వ్యాధి (హాన్సెన్ వ్యాధి)ని మైకో బ్యాక్టీరియం లెప్రె అనే బ్యాక్టీరియా కలిగిస్తుంది. మనిషి చర్మం, నరాలు, కళ్లపై ప్రభావం చూపుతుంది. ఇది అంటువ్యాధి కాదు. అయితే జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎక్కువకాలం ఉంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల సోకుతుంది. ఒక్కోదఫా శరీర అవయవాలు కోల్పోయి వైకల్యం ఏర్పడుతుంది. దీంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారాన్ని వరల్డ్ లెప్రసీ డేగా ప్రకటించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అయితే మన దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి రోజుని అనుసంధానంగా చేసి లెప్రసీ డేను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం థీమ్‌గా కు ష్టు వ్యాధి నయమవుతుంది. అందరికీ సేవలు, సమానత్వం. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 20 సంవత్సరాల క్రితం రెండు వేలకు పైగా కుష్టు రోగులు ఉండేవారు. చికిత్సతో అనేకమంది కోలుకున్నారు. కొందరు వృద్ధులు మరణించారు. గత సంవత్సరం వెయ్యికి పైగా రోగులుండగా ఆ సంఖ్య నేడు 996కి తగ్గింది. ఈ ఏడాది కొత్తగా 55 కేసులు వెలుగు చూశాయి. పాత కేసులతో కలిపి 107 మంది చికిత్సలో ఉన్నారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో రెండు కాలనీలు, రాపూరు వద్ద ఒక వ్యాధిగ్రస్తుల కాలనీలున్నాయి. ప్రభుత్వం రెండు దశాబ్దాలకు పైగా తీసుకున్న చర్యల ఫలితంగా జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
490 మందికి పింఛన్లు
సకాలంలో గుర్తించపోవడంతో కుష్టు వ్యాధితో 490 మంది అవయవ లోపంతో బాధపడుతున్నారు. వీరికి ప్రభుత్వం రూ.6 వేల చొప్పున పింఛన్ అందజేస్తోంది. 149 మందికి అంత్యోదయ కార్డులున్నాయి. జిల్లా కుష్టు నివారణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు 300 మందికి టబ్బులు, టవల్స్, నీమ్ ఆయిల్, పీబీ స్టోన్స్ (కాలి పగుళ్లు తగ్గేందుకు వాడే రాయి) అందజేశారు. 307 మందికి రెండు దఫాలుగా 614 జతల ఎంసీఆర్ చెప్పులిచ్చారు. 180 మందికి చేతికర్రలు, 150 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.


