వైఎస్సార్‌సీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: జిల్లాలో వైఎస్సార్‌సీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మనుబోలు మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. జగనన్న సైన్యం క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా, సంపూర్ణంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న సైన్యంలో యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, వారిని రాజకీయంగా చైతన్యవంతులను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గత ఐదేళ్ల పాలనలో కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూశామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు జగన్‌తోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు.


