కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించాలి. అదానీకి అక్రమంగా భూములు కట్టబెట్టడాన్ని వెంటనే ఆపివేయాలి’ అని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. టెర్మినల్‌ను పునరుద్ధరించాలంటూ నెల్లూరులోని ముత్తుకూరు గేటు సెంటర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే టెర్మినల్‌ను తిరిగి ప్రారంభిస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర మంత్రిమండలి కంటైనర్ టెర్మినల్ కాంప్లెక్స్ కోసం ఏర్పాటు చేసిన భూములకు బదులుగా జిల్లాలోని 5 మండలాల్లో భూములు కేటాయిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో వేలాది ఎకరాలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, అంకయ్య, సురేష్, రాజా, సుధాకర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు, సంపూర్ణమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


