సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

Jan 29 2026 6:07 AM | Updated on Jan 29 2026 6:07 AM

సూరాయ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

నెల్లూరు సిటీలో

మంత్రి అనుచరులే..

నెల్లూరు సిటీ పరిధిలోని కొత్త పెన్నాబ్రిడ్జి వద్ద, భగత్‌సింగ్‌ కాలనీ ప్రాంతాల్లో రేయింబవళ్లు ఇసుకను తరలిస్తున్న వైనం ఇటీవల వివాదాస్పదమైంది. టీడీపీ నేత, నుడా చైర్మన్‌ సైతం దీనిపై ఆరోపణలు గుప్పిస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని అధికారులను రీచ్‌ వద్దకు పిలిపించిన విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి నారాయణ సామాజికవర్గానికే చెందిన టీడీపీ పట్టణాధ్యక్షుడు మామిడాల మధుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సాప్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌లో బహిరంగంగా మాట్లాడారంటే ఏ స్థాయిలో ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక దోపిడీలో పోలీసులకే కమీషన్లు ఇస్తున్నామని వారు బాహాటంగానే చెప్పుకొంటున్నారు. అయితే ఈ ఇసుక దోపిడీని పోలీసులే తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారాయణ సైతం చెప్పినా.. సదరు ఇసుక దోపిడీదారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా, రాత్రుళ్లు టిప్పర్లలో కాకుండా ట్రాక్టర్లలో తరలించుకోమని ఉచిత సలహాలిస్తున్నారనీ, ఇందులో మంత్రికి వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.

ఎన్జీటీ ఆదేశాలు తుస్‌

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. కాలువకు సాగునీరు వెళ్లే చోట అడ్డంగా గట్టుకట్టి మరీ గ్రావెల్‌ వేసి రహదారులు నిర్మించి ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. భవిష్యత్తు ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా రోజూ వేలాది టన్నుల ఇసుకను తోడేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నా.. అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదు. అటు పోలీసులు ఇసుక అక్రమ దందాకు రక్షణగా ఉండగా, జిల్లా యంత్రాంగం సాగిల పడి అఽధికారానికి సలామ్‌ చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు.

తెలుగురాయపురంలో

అనుమతి లేని రీచ్‌లో

యంత్రాలతో తవ్వకాలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ నేతల ధనదాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, కోవూరు నియోజకవర్గాల పరిధిలో పెన్నానది ప్రవహిస్తోంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బినామీలతో తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకొంటున్నారు. నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీల్లో తరలిస్తున్నారు. పగలూ రాత్రనే తేడా లేకుండా పెన్నా నదిలో 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి టిప్పర్లు, లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తోడేళ్లతో సోమశిల ప్రాజెక్ట్‌తో పాటు దిగువన ఉన్న సంగం, పెన్నా బ్యారేజీలు, రైల్‌, రోడ్డు వంతెనలకు ప్రమాదం ముంచుకొస్తోంది. పెన్నమ్మ గర్భం శోకిస్తూ నిత్యం వణికిపోతోంది. నెలవారీగా ముడుపులు ముడుతుండటంతో అధికార యంత్రాంగం సైతం జీ హుజూర్‌ అంటూ కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లలో పొక్లయినర్లకు అనుమతి లేదని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తరలించడమే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక రేట్లకు అమ్మేసుకుంటున్నారు.

తెలుగురాయపురంలో..

వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలో తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అండతో పెన్నానదిని యంత్రాలతో కుళ్లబొడుస్తున్నారు. తెలుగురాయపురం సమీపంలో ఉన్న నదిలో భారీ యంత్రాలు పెట్టి నిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. ఇక్కడి ఇసుక రీచ్‌కు అనుమతి లేదు. పర్యావరణ అనుమతులూ లేవు. దీనికి కిలోమీటర్‌ పరిఽధిలోనే సోమశిల ప్రాజెక్ట్‌ ఉంది. అక్కడ తవ్వకాలు చేయకూడదనే నిబంధనలున్నాయి. కానీ స్థానిక తమ్ముళ్లు సంగం బ్యారేజీకి ముందు వైపు డీసిల్టింగ్‌ పేరుతో అనుమతులు పొంది తెలుగురాయపురంలో తవ్వేస్తున్నారు. నేరుగా నది మధ్యలోనే యంత్రాలను పెట్టి రేయింబవళ్లు ఇసుక తవ్వకాలను సాగిస్తూ భారీ టిప్పర్లలో లోడింగ్‌ చేస్తున్నారు. ఒక్కో వాహనానికి లోడింగ్‌ కింద రూ.12 వేల వంతున వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ రీచ్‌ నుంచి రోజుకు సగటున వంద లారీల్లో లోడింగ్‌ జరుగుతుండగా, రూ.12 లక్షల వరకు రాబడి వస్తున్నట్లు అంచనా. అందులో షాడో ఎమ్మెల్యేగా ఉన్న కీలక నేతకు రూ.8 లక్షలు, మిగిలిన సొమ్మును ఖర్చులతో పాటు తమ్ముళ్లు పంచుకుంటున్నారు. గత నెల రోజులుగా బరితెగించి తమ్ముళ్లు తవ్వకాలు చేస్తున్నా.. అధికారులకు తెలియదంటే.. ప్రజలు నమ్మాలి మరీ.

పీకేపాడులోనూ అదే పరిస్థితి

చేజర్ల మండలం పడమటికంభంపాడు ఓపెన్‌ రీచ్‌కు అనుమతి లేదు. కానీ అక్కడ డంపింగ్‌ పేరుతో అధికారుల వద్ద అనుమతి పొంది తమ్ముళ్లు బరితెగించి తవ్వకాలు చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్‌కు దిగువన 500 మీటర్లలోపే రీచ్‌ను ఏర్పాటు చేసి యంత్రాలు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఓ వైపు తెలుగురాయపురం, మరో వైపు పీకేపాడు రెండు అనధికార రీచ్‌లు సోమశిల ప్రాజెక్ట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. పది మీటర్ల లోతు వరకు ఇసుకను తోడేస్తుండటంతో ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందని ప్రాజెక్ట్‌ మాజీ ఇంజినీరింగ్‌ అధికారులు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్నాలో భారీ గోతులతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోతున్నాయి. భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. బరితెగించి నిత్యం వందల వాహనాల్లో లోడింగ్‌ చేస్తున్నా.. ఏ అధికారి ఆ వైపు కన్నెత్తి చూడటంలేదంటే అధికార పార్టీ ఒత్తిడితోపాటు వారికి నెల మామూళ్లు అందుతున్నాయనే ప్రచారమూ లేకపోలేదు.

విరువూరు రీచ్‌లో బరితెగింపు

సర్వేపల్లి నియోజకవర్గంలోని విరువూరు రీచ్‌లో తమ్ముళ్ల బరితెగిస్తున్నారు. రీచ్‌లో పర్యావరణానికి తూట్లు పొడిచేలా భారీ యంత్రాలతో రాత్రీ, పగలనే తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. దాదాపు 20 మీటర్లు వరకు నదీగర్భాన్ని తోడేశారు. డంపింగ్‌ పేరుతో యంత్రాలు పెట్టి నదిలోకి రోడ్లు వేసి దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో చేస్తున్న దందాను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్కో ట్రాక్టర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం టన్ను రూ.68 అయితే టీడీపీ నేతలు రూ.300 వరకు వసూలు చేశారు. వీరు పబ్లిక్‌గా ట్రాక్టర్‌ ఇసుకను రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్‌ ఇసుకకు రూ.1400 వసూలు చేయాల్సి ఉంటే రూ.8 వేలు.. 12 టైర్ల వాహనాలకు రూ.1600 వసూలు చేయాల్సి ఉంటే రూ.12 వేలు.. 14 టైర్ల వాహనాలకు రూ.15 వేల వంతున వసూలు చేసి దోచుకుంటున్నారు.

కోవూరులో విచ్చలవిడిగా..

ఈ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెం వద్ద డీసిల్టింగ్‌కు అనుమతి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా పోతిరెడ్డిపాళెం, మినగల్లు, జొన్నవాడు, జమ్మిపాళెం, సుబ్బారెడ్డిపాళెం, వేగూరు, లేగుంటపాడు, ముదివర్తి, ఊటుకూరు, ముదివర్తిపాళెం తదితర ప్రాంతాల్లో రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువులే ఈ రీచ్‌లను నిర్వహిస్తున్నారు. వీరంతా బినామీలను పెట్టి ఇసుక తవ్వుతున్నారంటూ స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు.

జిల్లా వ్యాప్తంగా రీచ్‌లలో జరిగేంత స్థాయిలో ఒక్క సూరాయపాళెం రీచ్‌లో ఇసుక దోపిడీ జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి బినామీ ద్వారా సాయి శ్రీనివాస్‌ అనే వ్యక్తికి చెందిన బ్యాంక్‌ అకౌంట్‌కు వెళ్లేలా క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసి నేరుగా చేతికి ఇసుక అంటకుండానే రూ. కోట్లు కొల్లగొడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇసుక కొనుగోలు చేసిన వారికి ట్రిప్‌ షీట్‌ పేరుతో చేత్తో రాసిన స్లిప్పును చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నాలుగున్నర టన్నులకు రూ.300 లోపు వసూలు చేయాల్సి ఉండగా, ఐదు రెట్లు అధికంగా రూ.1250 వంతున వసూలు చేస్తున్నారు. పైగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలనే ప్రభుత్వ నిబంధనలున్నా, రేయింబవళ్లు పొక్లయినర్లతో తోడేస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలే బినామీలను పెట్టి ఇసుక దందా

భారీ యంత్రాలతో పెన్నానదిలో

తోడేస్తున్న వైనం

సోమశిల నుంచి కడలి

వరకు 60 రీచ్‌లు

అనుమతులు మూడు చోట్లే

జిల్లా నుంచి 500 టిప్పర్లు,

వెయ్యికిపైగా ట్రాక్టర్లలో అక్రమ రవాణా

నిత్యం రూ.10 కోట్ల వ్యాపారం

కలువాయిలోని తెలుగురాయపురంలో తమ్ముళ్ల బరితెగింపు

విరువూరు, పీకేపాడు రీచ్‌లలో

అర్ధరాత్రీ తవ్వకాలు

సోమశిల ప్రాజెక్ట్‌కు పొంచి ఉన్న ముప్పు

పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా.. పట్టించుకోని అధికారులు

మామూళ్ల మత్తులో కళ్లకు గంతలు

పెన్నానదిలో టీడీపీ తోడేళ్లు సై‘ఖతం’ చేస్తున్నాయి. గర్భశోకంతో నది అల్లాడిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలు భారీ యంత్రాలు పెట్టి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతుల్లేకుండా ఇసుకను ఇష్టారీతిన తోడేస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్‌ దిగువ నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న పెన్నాలో ఊరికో రీచ్‌ను ఏర్పాటు చేసి రేయింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. రోజూ రూ.కోట్లల్లో ఇసుక వ్యాపారం జరుగుతుందంటే దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా పొర్లుకట్టలను తవ్వేసి, నదిలోకి గ్రావెల్‌ రోడ్లు వేసి ఇసుక రవాణా చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు ప్రైవేట్‌ వ్యాపారుల క్యూఆర్‌ కోడ్‌ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుస్తోంది. ఇటీవల మంత్రి నారాయణ తన నియోజకవర్గంలో టీడీపీ నేతలే ఇసుక దోపిడీ చేస్తున్నారంటూ మాట్లాడిన మాటలను బట్టే అర్థమవుతోంది.

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 1
1/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 2
2/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 3
3/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 4
4/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 5
5/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 6
6/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ 7
7/7

సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement