అనుమతి గోరంత.. తవ్వేది కొండంత
వరంలా సాగరమాల
చిట్టమూరు/చిల్లకూరు: చిట్టమూరు మండలంలోని మెట్టు గ్రామంలో తెలుగుదేశానికి చెందిన ప్రజాప్రతినిధుల అండతో 9 నెలలుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. గనుల శాఖ నుంచి 30 సంవత్సరాలకు సుమారు ఏడు ఎకరాలకు లీజు పొంది తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అక్కడే కాకుండా పక్కనే ఉన్న మరో 40 ఎకరాల్లో ఇష్టానుసారంగా తవ్వి రోజూ కనీసం 70 నుంచి వంద టిప్పర్లలో గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో 6 నుంచి 13 అడుగల మేర మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అయితే గనులు, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం అటువైపు కన్నెతి చూడకపోవడంతో 15 నుంచి 20 మీటర్ల వరకు తవ్వకాలు చేపడుతున్నారు. మూగజీవాలు ఆ గుంతల్లో పడితే ప్రాణాలు పోయే ప్రమాదముంది.
అడ్డుకుంటూ..
గ్రావెల్ తవ్వకాలు చేపట్టే ప్రాంతానికి పూర్తిగా కంచె వేశారు. లోపల ఏమి జరుగుతుందో బయట వారికి తెలియకుండా అడ్డుకునేలా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా వెళ్తే ఎందుకొచ్చారు?, ఇక్కడ మీకేం పనంటూ అడ్డుకోవడంతోపాటుగా దౌర్జనాలకు పాల్పడుతున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో టిప్పర్లు తరలిపోతున్నా అధికారులు తమకేం పట్టనట్టున్నారు.
ఇక్కడ కూడా..
కోట మండంలో రెవెన్యూ, గనుల శాఖాధికారులకు టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు ఎక్కవ అవుతుండటంతో కనీసం తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. ఊనుగుంటపాళెంలో సుమారు 50 ఎకరాల్లో గ్రావెల్ తవ్వేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అలాగే రాఘవాపురం, కొండుగుంట, మద్దాలి ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. టిప్పర్ల రాకపోకలతో రహదారులు పూర్తిగా దెబ్బతినడంతోపాటు ఆయా గ్రామల ప్రజలు దుమ్ముతో అల్లాడిపోతున్నారు.
గూడూరు నియోజకవర్గంలో
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
చిట్టమూరు మండలంలో 9 నెలలుగా..
కోట మండలంలోనూ అదే పరిస్థితి
ప్రభుత్వాదాయానికి గండి
చోద్యం చూస్తున్న గనులు, రెవెన్యూ శాఖలు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గూడూరు నియోజకవర్గంలో ఇసుక, సిలికా, గ్రావెల్, మట్టి, తెల్లరాయిని నేతలు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న విషయం తెలిసి అధికారులు వెళ్తే మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం.. అనుమతులు ఉన్నాయంటున్నారు. రోజూ వందల లారీలు, టిప్పర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక తరలిపోతోంది.
గ్రావెల్, మట్టి తవ్వకాల చేపట్టే వారికి సాగరమాల రహదారి నిర్మాణం వరంలా మారింది. గత ప్రభుత్వ హయాంలో దాని నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ నేరుగా భూములు కొనుగోలు చేయడం, ఎక్కడైనా క్వారీలుంటే అక్కడ్నుంచి గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టి వినియోగించుకునేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తవ్వకాలు పూర్తిగా నిలిపివేసి తమ కనుసన్నల్లోనే జరగాలని పట్టుబట్టారు. దీంతో గ్రావెల్, మట్టి తరలించేందుకు ముందస్తుగా అధికార పార్టీకి చెందిన నాయకుల అనుమతి తీసుకోవాలి. సాగరమాల కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులు నేతలకు నగదు ఇచ్చి గ్రావెల్‌ను తీసుకెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో ఎక్కవ శాతం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తోంది.
అనుమతి గోరంత.. తవ్వేది కొండంత


