గుప్త నిధుల కలకలం
● సంగం కొండపై భారీ గుంత
● ఘటన స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు
● పోలీసులకు సమాచారమిచ్చిన
పశువుల కాపర్లు
● భయాందోళనలో స్థానికులు
సంగం: సంగంలోని కొండ ప్రాంతంలో బుధవారం వెలుగు చూసిన భారీ గుంత కలకలం రేపింది. గుప్త నిధుల కోసం తవ్వారా లేదా క్షుద్రపూజలు చేశారాననే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సంగానికి ఇరువైపులా ఉన్న కొండ ప్రాంతంలో అక్కడక్కడా అలనాటి సంస్కృతికి సంబంధించిన శిలలు, కాలభైరవుడి విగ్రహం ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో గుప్త నిధుల ముఠా కళ్లు దీనిపై పడ్డాయని తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు వారంలో మూడుసార్లు పడిగాపులు కాయగా.. మరికొందరు కొండ పైభాగానికి వెళ్లి తవ్వకాలు సాగించడంతో ఏర్పడిన భారీ గుంత సుమారు 100 అడుగులపైనే ఉంటుంది. గుంతలో నిచ్చెనను సైతం ఏర్పాటు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఓ చెట్టుకు పసుపు, కుంకుమను చల్లి.. నిమ్మకాయలను ఉంచి పూజలు చేసిన ఆనవాళ్లు సైతం దర్శనమిస్తున్నాయి.
ప్రశ్నించడంతో పరార్..
సంగం కొండపై పట్టపగలే గుంత తవ్వుతుండటంతో గొర్రెల కాపరి కేశవులు గమనించారు. గుంత పైభాగంలో ఇద్దరు కూర్చొని ఉండగా, కొత్త వారిగా గుర్తించి ప్రశ్నించారు. దీంతో వీరు పరారయ్యారు. ఆపై సంగం పోలీసులకు సమాచారమిచ్చారు. కొండపైకెళ్లి భారీ గుంతను ఎస్సై రాజేష్, సిబ్బంది పరిశీలించారు. చెంతనే ఉన్న చెక్‌పోస్ట్ వాసులతో మాట్లాడారు. ఆనవాళ్ల బట్టిచూస్తే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. ముఠాను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.
ఖేలో ఇండియా కేంద్రాల
ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఖేలో ఇండియా క్రీడా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా 139 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని వివరించారు. దీనికి సంబంధించిన క్రీడా శిక్షణకు అవసరమైన మైదానాలు, మౌలిక సదుపాయాలున్న వారు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపొచ్చని చెప్పారు. సదరు సంస్థకు ఉన్న అనుభవం, క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని కేంద్రాలను కేటాయించనున్నామని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నిర్ణీత దరఖాస్తులను ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో వచ్చే నెల సాయంత్రం 5.30లోపు అందజేయాలని కోరారు.


