ఉత్తరాది రాష్ట్రాల్లో కార్లు దొంగలించి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆయన అధికార పార్టీ కార్యకర్త. ఓ కానిస్టేబుల్ భర్త. లగ్జరీ జీవితం అనుభవించాలని భావించాడు. ఉత్తరాది రాష్ట్రా ల్లో లగ్జరీ కార్లను దొంగలించి సన్నిహితులతో నంబరు ప్లేట్లు మార్చి, నకిలీ రికార్డులు సృష్టించి విక్రయిస్తూ దొంగసొమ్ముతో విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. దొంగ కార్ల కేసులో ఇప్పటికే ఇద్దరు స్నేహితులు పోలీసులకు చిక్కితే.. తమ్ముడు మాత్రం దొరకలేదు. అటు తెలుగు తమ్ముడు.. ఇటు ఖాకీ మొగుడు కావడంతో వదిలేశారన్న ప్రచారం సాగుతోంది.
బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు ప్రాంతానికి చెందిన మస్తాన్ టీడీపీ కార్యకర్త. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ నేతలకు దగ్గరయ్యాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అతని లైఫ్ స్టైల్ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన భార్య నెల్లూరు నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. దంపతులు పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మస్తాన్‌కు నెల్లూరు బీవీనగర్‌కు చెందిన కార్ల గ్యారేజ్ నిర్వాహకుడు టి.శివ, తిరుపతిలోని ఓ కార్ల షోరూమ్‌లో పని చేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన పి. లక్ష్మణ్‌కుమార్ స్నేహితులు. వీరు ఎలాగైనా డబ్బు సంపాదించి ఆర్థికంగా బలపడాలని నిర్ణయించుకున్నారు.
గుట్టు బయటపడిందిలా..
ఇటీవల దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో శివ, లక్ష్మణ్‌కుమార్ అనుమానాస్పదంగా ఉండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న కార్ల దొంగతనం వ్యవహారం బట్టబయలైంది. దీంతో ప్రధాన నిందితుడు పరారీ కావడంతో శివ, లక్ష్మణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి ఐదు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని పశ్చిమ విహార్, డీబీజీ రోడ్డు సెంట్రల్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర నాగపూర్ జిల్లా యశోదరానగర్, హరియాణా రాష్ట్రం జనకపురి పరిధిలో కార్ల దొంగతనాలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో పోలీసు కేసు నమోదైంది.
ఇంకెంత కావాలో చెప్పు.. చాలా కార్లు కొట్టుకొస్తా డార్లింగ్
ఇంతేనా?
ప్రధాన నిందితుడు పోలీస్ భర్త కావడంతో..
ఈ కేసులో ప్రధాన నిందితుడు మస్తాన్ ఓ పోలీస్ కానిస్టేబుల్ భర్త కావడంతో ఇతన్ని పట్టుకునే విషయంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇతని కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ అందులో నిజం కొంతేనని సమాచారం. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు ఎక్కడున్నాడో పసిగట్టడం పెద్ద పనికాదని, అందులోనూ కానిస్టేబుల్ భర్త కావడం వల్ల తెలుసుకోవడం అంత కష్టం కాదనేది అక్షర సత్యం. నిందితులు ఏ కలుగుల్లో దాక్కున్నా.. ఇట్టే గంటల వ్యవధిలో పట్టుకొచ్చి మీడియా ముందు చూపించి కటకటల వెనక్కి పంపించే పోలీస్ సామర్థ్యం ఈ విషయంలో జాప్యానికి కారణాలు అనేకం ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన నిందితుడు టీడీపీ కార్యకర్త కావడంతోపాటు అతను కార్లను టీడీపీ నేతలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇతను పట్టుబడితే ఎక్కడెక్కడ ఎన్ని కార్లు అపహరించాడు.. ఎవరెవరికి విక్రయించాడో బయటపడితే.. మరికొందరు టీడీపీ తమ్ముళ్ల అక్రమ బాగోతాలు బయటకు వస్తాయనే భయంతో ఈ వ్యవహారం వెలుగుచూసి రెండు వారాలు అవుతున్నా.. ఇంత వరకు పట్టుకోవడంలో ఖాకీలు కాలయాపన చేస్తున్నట్లు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో కార్లను దొంగలించి ఇక్కడికి తీసుకువచ్చి విక్రయించడం అంతా అషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో నిందితుడు ఒక్కడే కార్లను దొంగలించాడా? ఆయా రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు లేకపోలేదు. నిందితుడు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో మారిన లైఫ్ స్టైల్
ఖాకీ నీడలో ఖరీదైన కలలు.. అధికార పార్టీ కార్యకర్త ముసుగులో దొంగతనాలు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మారిపోయిన ‘ఓ తెలుగు తమ్ముడు’ జీవితం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సబ్‌స్టేషన్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకునే వ్యక్తి, ఖాకీ ధరించిన భార్య నీడలో దొంగ సొమ్ముతో లగ్జరీ ఇళ్లు, ఖరీదైన హెయిర్ కట్‌లు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో కార్ల దొంగతనాల దందాకు మాస్టర్ మైండ్‌గా మారాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లకు నకిలీ పత్రాలు సృష్టించి, నంబర్ ప్లేట్లు మార్చేసి అతి తక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు బయటపడినా.. ప్రధాన నిందితుడు తెలుగు తమ్ముడు మాత్రం ఇంకా పోలీసుల చేతికి చిక్కకపోవడం వెనుక ‘ఖాకీ సంబంధాలే రక్షణగా మారాయా?’ అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇతను దొరికితే.. తమ్ముడికి సహకరించే మరికొందరు తమ్ముళ్ల బాగోతాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాల్లోనే హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది.
చేసేది సబ్ స్టేషన్‌లో హెల్పర్ ఉద్యోగం
ఈ కొలువుకు రూ.12 లక్షలు లంచం ఇచ్చుకున్నట్లు ఆరోపణలు
ఏడాదిన్నరలోనే లగ్జరీ ఇల్లు కొనుగోలు
సినిమాల్లోనూ పెట్టుబడులు
ఆయన హేర్ కటింగ్ చేయించుకుంటే రూ.70 వేల ంట!
ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రాల్లో ఖరీదైన లగ్జరీ కార్ల అపహరణ
నకిలీ పత్రాలను సృష్టించి, నంబరు ప్లేట్లు మార్చి నెల్లూరులోనే అతి తక్కువకే విక్రయాలు
ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినా తమ్ముడు మాత్రం దొరకలేదంట
ఇతను దొంగ దొరికితే.. మరికొందరు తమ్ముళ్ల బాగోతాలు బట్టబయలు!
అటు తమ్ముడు, ఇటు ఖాకీ మొగుడు కదా అందుకే వదిలేశారేమో..
విలాసవంతమైన జీవనం
కార్ల విక్రయ సొమ్ముతో ప్రధాన నిందితుడు మస్తాన్ విలాసవంతంగా జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా రూ.12 లక్షల దొంగ సొమ్మును లంచంగా ఇచ్చి పేరుకు సబ్‌స్టేషన్‌లో హెల్పర్ ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరలోనే నెల్లూరులో ఖరీదైన ప్రాంతంలో రూ.కోట్లు విలువైన లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో సైతం పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆయన హేర్ కటింగ్‌కే రూ.70 వేలు ఖర్చు చేస్తున్నాడంటే ఏ స్థాయిలో జీవితం అనుభవిస్తున్నాడో ఇట్టే అర్థమవుతోంది. సినీ రంగంలో పెట్టుబడులు పెడుతూ.. సినిమాల్లోనూ నటిస్తున్నాడని సమాచారం.
కార్లను దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు పథక రచన చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దొంగలిస్తే త్వరితగతిన ఈ వ్యవహారం బయట పడుతుందని భావించి ఉత్తరాది రాష్ట్రాలను ఎంచుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణాల్లో మకాం వేసి లగ్జరీ కార్లను దొంగలించి నెల్లూరుకు తీసుకువచ్చి శివ గ్యారేజ్‌లో ఉంచేవాడు. శివ, లక్ష్మణ్‌కుమార్ సాయంతో ఆ కార్ల నంబర్ ప్లేట్లను మార్చి వాటి స్థానంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నంబర్ ప్లేట్లను అమర్చేవారు. అనంతరం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో కార్లు దొంగలించి..


