కంచె తీగలే.. చితులయ్యాయి | - | Sakshi
Sakshi News home page

కంచె తీగలే.. చితులయ్యాయి

Jan 26 2026 4:08 AM | Updated on Jan 26 2026 4:08 AM

కంచె తీగలే.. చితులయ్యాయి

కంచె తీగలే.. చితులయ్యాయి

ఆ ఇద్దరు గిరిజన యువకులు సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పలకా, బలపం పట్టాల్సిన వయస్సు నుంచే కూలీ పనులు చేస్తూ, చేపల వేట సాగిస్తూ తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వెళ్లి తాపీ పనులు చేస్తూ కుటుంబ పోషణలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సంక్రాంతిని కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికొచ్చారు. పది రోజులు సరదాగా గడిపారు. శనివారం రాత్రి వేళ పిల్లాపేరు వాగులో చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా వారి పాలిట విద్యుత్‌ తీగలు వేటగాళ్లయ్యాయి. మిత్రత్వం ప్రాణాల చివరి వరకూ విడవలేదు. మరణంలోనూ కలిసి కాలి బూడిదయ్యారు. తల్లిదండ్రుల కన్నీళ్లతో తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ శోకసంద్రంగా మారింది.

ఉదయగిరి/వరికుంటపాడు: తెల్లారితే.. ఆదివారం కావడంతో పిల్లాపేరులో శనివారం రాత్రి సరదాగా టార్చిలైట్ల వెలుగులో చేపల వేటకు బయల్దేరారు. అయితే దారి మధ్యలో పంట రక్షణకు వేసిన కంచె తీగలే వారి పాలిట వేటగాళ్లయ్యాయి. చివరికి చితులయ్యాయి. వరికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన మేకల తిరుపాలు, నయోమి మూడో సంతానం గణేష్‌ (19). పేద కుటుంబం కావడంతో చిన్న తనం నుంచి తల్లిదండ్రులకు పనుల్లో ఆసరాగా, ఎదిగొచ్చాక తాపీ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబానికి ఆదరవుగా ఉన్నాడు.అదే కాలనీకి చెందిన తలపల మాలకొండయ్య, సునీత ఇద్దరి సంతానంలో పెద్ద కుమారుడు రమేష్‌ (17). వీరిది పేద కుటుంబం. రోజూ వారి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. రమేష్‌ సైతం తన స్నేహితుడు గణేష్‌తో కలిసి తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానికంగా పనులు తక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రాంతానికి తాపీ పనులు చేసేందుకు వలసపోయారు. సంక్రాంతి వేళ కుటుంబ సభ్యులతో గడిపేందుకు వచ్చిన ఆ ఇద్దరు సోమవారం తిరుగు ప్రయాణానికి బస్సు టికెట్లు రిజర్వు చేసుకున్నారు. అయితే రాత్రి వేళ లైట్ల వెలుగులకు చేపలు పట్ట డం సులువుగా ఉంటుందని సమీపంలోని పిల్లా పేరు వాగు వద్దకు బైక్‌పై బయల్దేరారు. పొలాల మధ్యలో ఉన్న బాట దారిలో వెళ్తుండగా విద్యుత్‌ తీగలు మృత్యుపాశాలుగా మారాయి.

బైక్‌తో సహా బూడిద

బొంగరాలపాడులో వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన మాదరపు వెంకటేశ్వర్లు కంది పంట సాగు చేస్తున్నాడు. ఆ కంది చేనును అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు ఆయన 12 కేవీ లైన్‌ నుంచి అక్రమంగా విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దారి పక్కనే విద్యుత్‌ వైర్లు ఉండటాన్ని గమనించకుండా తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన గణేష్‌, రమేష్‌ వెళ్తుండగా వాటిని తగులుకుని బైక్‌తోపాటు ఇద్దరు విద్యుత్‌ కంచైపె పడ్డారు. దీంతో హైఓల్టేజ్‌తో బైక్‌తోపాటు ఇద్దరు కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని విధంగా కాలి బొగ్గులుగా మారారు. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన కొడుకులు ఊహించని విధంగా అగ్నికీలల్లో సజీవ దహనం కావడం జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం

జిల్లాలోని మెట్ట పైర్లు సాగు చేసే ప్రాంతాల్లో రైతులు తమ పంటలను పందులు, జింకలు, ఇతర అటవీ జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు చుట్టూ విద్యుత్‌ కంచెలు వేస్తున్నారు. ఈ క్రమంలో అడవి జంతువులే కాకుండా, మనుషులు కూడా ప్రమాదం బారిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీనిపై విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై గ్రామ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. రైతులు పంటలు కాపాడుకునేందుకు సోలార్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ప్రాణాపాయం ఉండదు. కానీ కొంత మంది బడా రైతులు నిర్లక్ష్యంతో అధిక ఓల్టేజ్‌ ఉండే 11 కేవీ లైన్లను ఉపయోగిస్తున్నారు. ఈ విషయం ఎస్సీడీసీఎల్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇద్దరు స్నేహితులు సజీవ దహనం

మరణంలోనూ వీడని స్నేహ బంధం

కడచూపునకు కూడా నోచుకోక విలపించిన తల్లిదండ్రులు

శోక సంద్రంగా మారిన

తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ

కఠిన చర్యలు తీసుకుంటాం

ఈ విషాదకరమైన ఈ ఘటనకు సంబఽంధం ఉన్న అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత బాధ్యులైన విద్యుత్‌ శాఖాధికారులపై చర్యలకు ప్రతిపాదన చేస్తాం. ఈ ఘటనపై ఎవరినీ ఉపేక్షించబోము. దర్యాప్తు చేపట్టి.. నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం.

వెంకట్రావు, సీఐ ఉదయగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement