భూములపై పచ్చ గద్దలు | - | Sakshi
Sakshi News home page

భూములపై పచ్చ గద్దలు

Jan 26 2026 4:08 AM | Updated on Jan 26 2026 4:08 AM

భూములపై పచ్చ గద్దలు

భూములపై పచ్చ గద్దలు

ఆత్మకూరు: వ్యవసాయమే వీరి జీవనాధారం. తరతరాల నుంచి వస్తున్న భూములను సాగు చేసుకుంటూ మారుమూల గ్రామంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తెలియకుండానే 20 మందికి చెందిన 11.28 ఎకరాలను తన పేరిట ఓ టీడీపీ నేత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇది చేసిన వారు కేరళ, దుబాయ్‌ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బాధిత రైతులు ఆత్మకూరు ఆర్డీఓ పావని ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.

జరిగిందిదీ..

ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమనిచిరివెళ్లలో సర్వే నంబర్‌ 19, 20, 21, 22, 24, 26లో 20 మందికిపైగా కర్షకులకు చెందిన 11.28 ఎకరాల సాగు భూమిని వెంగంపల్లికి చెందిన టీడీపీ నేత బట్రెడ్డి రోశిరెడ్డి తన కుమారుడు మహేష్‌రెడ్డి సహకారంతో దూర ప్రాంత రైతులు విక్రయించినట్లుగా ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. గ్రామానికి ఇటీవల వచ్చి ఇవి తన పేరిట రిజిస్టరయ్యాయని, వీటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని పేర్కొనడంతో రైతులు నివ్వెరబోయారు. తరతరాలుగా తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూములని.. టెన్‌1, అడంగళ్‌, పట్టాదారు పాస్‌పుస్తకాలు తమ వద్దే ఉండగా, భూములు ఆయనకెలా దక్కాయని ప్రశ్నించారు. దిక్కుతోచని స్థితిలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇటీవల అందజేశామని వారు పేర్కొన్నారు.

రికార్డులను తారుమారు చేసి..

గతంలో అనంతసాగరం ఇన్‌చార్జి తహసీల్దార్‌, వీఆర్వో, సర్వేయర్‌ ముడుపులను స్వీకరించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పేరుతో నమోదు చేయడంతో రోశిరెడ్డికి రిజిస్ట్రేషన్‌ చేశారనే విషయం తెలిసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా, లింగంగుంటకు చెందిన ఓ టీడీపీ నేత బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక గతేడాదిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. తమ పొలాలను సొంతం చేసుకునేందుకు యత్నించిన వారిని అడ్డగిస్తే, పోలీసుల నుంచి ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీటిపై కలెక్టర్‌, ఆర్డీఓ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.

రైతులకు తెలియకుండానే తమ

పేరిట రిజిస్ట్రేషన్‌

బరితెగిస్తున్న టీడీపీ నేతలు

ప్రశ్నిస్తే.. బెదిరింపులు

దిక్కుతోచక విలవిల్లాడుతున్న

20 మందికిపైగా రైతులు

టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అక్రమాల పరంపరను ఆ పార్టీ నేతలు సాగిస్తున్నారు. ఇసుక, మట్టి ఇలా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ భారీగా వెనుకేసుకుంటున్న వీరి కళ్లు తాజాగా పేదలపై పడ్డాయి. అధికారముందనే ధీమాతో చెలరేగిపోతూ రైతుల భూములను వారికి తెలియకుండానే తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకొని పొట్టగొడుతున్నారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కొందరి సహాయ, సహకారాలు వీరికి పుష్కలంగా ఉండటంతో ఈ వ్యవహారాలకు అడ్డే లేకుండా పోతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమనిచిరివెళ్లలో జరిగిన ఈ తంతు విస్మయానికి గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement