
క్రికెట్ అసోసియేషన్‌లో కేటుగాళ్లు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): క్రికెట్ మైదానంలో ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడే క్రికెట్ అసోసియేషన్‌లో కేటుగాళ్ల చర్యలతో క్రీడాకారులు బలైపోతున్నారు. నెల్లూరు జిల్లా క్రీడా అసోసియేషన్ తీరుపై సోమవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని జిల్లా క్రికెట్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుల తల్లిదండ్రులు అసోసియేషన్ నాయకుల మధ్య వాగ్వాదంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. క్రికెట్ అసోసియేషన్ నేతలు చెప్పే సమాధానాలపై సంతృప్తి చెందకపోవడంతో గందరగోళం నెలకొంది.
నెల్లూరుకు చెందిన అల్లారెడ్డి సుధాకర్ కుమార్తె సాత్వికారెడ్డి క్రికెట్ అండర్–19 టీంలో వైజాగ్‌లో జరిగిన సౌత్‌జోన్‌కు సెలెక్ట్ అయింది. జిల్లా అండర్–19 టీంలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న తన కుమార్తెను ఆడనివ్వకుండా బయట జిల్లాల నుంచి వచ్చిన అల్లా సహారా అనే ఇద్దరు అమ్మాయిలను టీం తరఫున సౌత్‌జోన్ టీంలో ఆడించారని, మన జిల్లా అసోసియేషన్‌లో ఉన్న సాత్వికారెడ్డిని ఆడించకుండా వారిద్దరిని ఆడించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులురెడ్డి ఇష్టముంటే ఆడండి లేకపోతే వెళ్లండనంతో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ భానుప్రకాష్‌రెడ్డిని అడగమని తప్పించుకున్నారు. భానుప్రకాష్‌రెడ్డి రెచ్చిపోయి మీ అమ్మాయి ఆడలేదా, రికార్డ్స్ మీకు తెలియదా అంటూ వారిపై ఎదురు మాటల దాడి చేశారు. దీంతో క్రీడాకారుల తల్లిదండ్రులు అసలు అసోసియేషన్‌కు, నీకు ఏం సంబంధం, నువ్వెలా మమ్మల్ని ప్రశ్నిస్తావు, సమాధానాలు చెప్పాల్సింది సెక్రటరీ కదా అంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.
వెల్లువెత్తుతున్న ఆరోపణలు
జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద క్రికెట్ ఆడుతున్న తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేశారు. క్రికెట్ అసోసియేషన్ బైలాస్‌లో లేని జనరల్ మేనేజర్ పదవిని భానుప్రకాష్‌రెడ్డికి ఇవ్వడం వల్లే అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. జట్ల ఎంపికలో ఇతర జిల్లాల బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులను ఎంపిక చేయడం, టోర్నమెంట్‌లకు వెళ్లేటప్పుడు భానుప్రకాష్‌రెడ్డికి ఇష్టమైన కోచ్‌లు, మేనేజర్లను పంపడం, అక్కడ ఎవరితో ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, ఎవరెవరిని ఆడించాలో ఆయన ఫోన్ ద్వారా చెప్పడం, అక్కడ ప్రతిభ గల క్రీడాకారులను ఆడించకపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. ఆయన ఏ లాభం చూసుకుని ఇతర జిల్లాల క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసి ఆడిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అండర్–19, అండర్–16, అండర్–23 ఇలా ఏ జట్టులోనైనా 15 మంది సభ్యులను కాకుండా 20 మందిని ఎంపిక చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్‌లో ఏసీఏ ఆమోదం లేకుండానే కోశాధికారిగా హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ కంపెనీ యజమానిని పెట్టడం, డబ్బులు స్వాహా చేయడమే లక్ష్యంగా నాయకులు వ్యవహరిస్తున్నారని క్రీడాకారుల తల్లిదండ్రలు విమర్శలు చేశారు.