
అర్జీలిచ్చి.. కనికరించాలని కోరి..
● కలెక్టరేట్‌లో
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
● 486 వినతుల అందజేత
నెల్లూరు రూరల్: ‘చాలా దూరం నుంచి వచ్చామయ్యా. మాపై కనికరం చూపి సమస్యల్ని పరిష్కరించండి’ అని ప్రజలు కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కె.కార్తీక్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి అర్జీలను స్వీకరించారు. మొత్తం 426 అర్జీలందాయి. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 166, మున్సిపల్ శాఖవి 41, సర్వేవి 46, పంచాయతీరాజ్ శాఖవి 66, పోలీస్ శాఖవి 67, సెర్ప్ శాఖవి 12 తదితరాలున్నాయి. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖ మెడికల్ క్యాంపు నిర్వహించింది.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
దగదర్తి గ్రామంలో భీమా ధాబాలో మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని, దీంతో రక్షణ లేకుండా పోయిందని దళితవాడకు చెందిన ప్రజలు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ మద్యం తాగిన వారు మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీనిపై యజమానిని ప్రశ్నిస్తే రౌడీషీటర్ ద్వారా బెదిరిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు తమకేం పట్టనట్టు ఉన్నారన్నారు. దళితులమైన తమపై దాడి చేయడం సరికాదన్నారు. యజమాని వినయ్, రౌడీషీటర్ కడియాల సురేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పంచాయతీ స్థలం ఆక్రమించారు
పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కొండాపురం మండలం గుడవల్లూరు టీడీపీకి చెందిన సర్పంచ్ బద్దెపూడి మాచర్ల వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సదరు భూమిలో బోరు వేసి గ్రామ ప్రజలకు తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. టీడీపీకి చెందిన చిమ్మిలి శ్రీనివాసులు, చెంచురామయ్య అనే వ్యక్తులు ఆక్రమించి గదుల నిర్మాణానికి ప్రయ త్నిస్తున్నారని తెలిపారు. మండల సర్వేయర్‌కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఉప సర్పంచ్ వేములపాటి మణికుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నాసిరకం భోజనం
జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతి కారణంగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని పీడీఎస్‌యూ నేతలు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఎం.సునీల్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే ఈ పద్ధతి మార్చాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు షేక్ షారుఖ్, కె.ఆశిర్, షేక్ మస్తాన్, నవీన్, హర్ష, హుస్సేన్ పాల్గొన్నారు.

అర్జీలిచ్చి.. కనికరించాలని కోరి..

అర్జీలిచ్చి.. కనికరించాలని కోరి..

అర్జీలిచ్చి.. కనికరించాలని కోరి..