
అన్నవరం క్వారీలోని అవినీతిని వెలికితీస్తాం
కావలి (జలదంకి): కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి అవినీతి సామ్రాజ్యం అన్నవరం క్వారీలో అక్రమాలను వెలికితీస్తాం, మనీ స్కీమ్ స్కామ్‌లో పోలీసులతో సహా అందరి పాత్రను బయటకు తీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించే విధంగా అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమ కేసులకు టీడీపీ పన్నాగం పన్నిందని, అవినీతిని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని, కేసులకు భయపడే వ్యక్తులం కాదన్నారు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరి తాట తీస్తామని హెచ్చరించారు. సోమవారం కావలిలోని ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కాకాణి మాట్లాడుతూ ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసు విషయం తెలుసుకున్న తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో బాధపడ్డారని, అన్నిటికి ధైర్యంగా ఉండాలని నామాటగా చెప్పమన్నారని చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయమని, ప్రజల గొంతుకై పోరాడాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలే లక్ష్యంగా కూటమి అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నామన్నారు. కావలిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అన్నవరం క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా తెలుసన్నారు. దీనిపై కలెక్టర్‌తో పాటు అధికారులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్నవరం అక్రమ మైనింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని మా నాయకులు, కార్యకర్తలతో కలిసి త్వరలో ‘చలో అన్నవరం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. కావలిలో జరిగిన మనీ స్కామ్‌లో ఎవరు ఎంత దోచుకున్నారో వెలికితీసి ప్రజలకు వివరిస్తామన్నారు. అక్రమ కేసులపై న్యాయంగా పోరాటాలు చేస్తామన్నారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం నిర్వీర్యం అయిందని, టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదమన్నట్లు అక్రమ కేసులు పెడుతూ, చివరకు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారన్నారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎలాంటి వారో ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి బాగా తెలుసన్నారు. కావలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, ఇక్కడ ఎంతో మంది వ్యాపారస్తులు, ఉద్యోగులు స్నేహపూరితంగా ఉంటారన్నారు. అలాంటి కావలిలో అరాచకాలు పెరిగాయన్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారని, దీనికి ఫలితం అనుభవించక తప్పదన్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారని. శాంతి భద్రతలను గాలికొదిలేసి కూటమి నాయకులు తప్పుడు కేసులకు జీవం పోస్తున్నారని మండిపడ్డారు. అమావాస్య తరువాత పౌర్ణమి వస్తుందని, అలాగే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు పటా పంచలు అవుతాయన్నారు. డ్రోన్‌తో అక్రమ మైనింగ్‌ను వీడియోలు తీస్తే పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాకాణి కుమార్తె పూజిత, వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందింటి కామరాజు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు కనమర్లపూడి వెంకటనారాయణ, నాయకులు మద్దిబోయిన వీరరఘు, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, జంపాని రాఘవులు, కుందుర్తి కామయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడం
‘చలో అన్నవరం’ కార్యక్రమానికి శ్రీకారం
పోలీసులే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు
ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటానని జగన్ నా మాటగా చెప్పమన్నారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి