మోసపోయాం.. న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

మోసపోయాం.. న్యాయం చేయండి

Aug 26 2025 8:14 AM | Updated on Aug 26 2025 8:14 AM

మోసపోయాం.. న్యాయం చేయండి

మోసపోయాం.. న్యాయం చేయండి

పోలీసుల ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ 93 ఫిర్యాదుల అందజేత

నెల్లూరు(క్రైమ్‌): ఉద్యోగాలిప్పిస్తామని కొందరు.. రుణాలు ఇప్పిస్తామని మరికొందరు.. పెళ్లి పేరిట ఇంకొందరు మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్‌, చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు నిర్వహించారు. 93 మంది తమ సమస్యలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో లీగల్‌ అడ్వైజర్‌ టి.శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పలు ఫిర్యాదులు

● ఆస్తి రాసివ్వాలంటూ మూడో కుమారుడైన వెంకటేశ్వర్లు, అతని భార్య నన్ను చిత్రహింసలకు గురిచేయడమే కాకండా ఇంటి నుంచి తరిమేశారు. నా ఇంటికి తాళం వేశారు. నేను బంధువుల వద్ద ఉంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కలువాయికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు.

● చెడు వ్యసనాలకు బానిసైన నా భర్త నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. భర్త, అత్తమామలు ఇటీవల నన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

● విజయవాడకు చెందిన శివయ్య, హరితేజ. అరవింద్‌లు రైల్వే ఉద్యోగులు. నా కుమారుడికి రైల్వే శాఖలో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6 లక్షలు తీసుకుని మోసగించారని దర్గామిట్టకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.

● నగరానికి చెందిన వినోద్‌ దంపతులు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష నగదు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుండా నగదు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు.

● నాకు ఓ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో గాయత్రి పరిచయమైంది. తాను మలేసియాలోని సీఐఎంబీ బ్యాంక్‌లో పనిచేస్తున్నాని నమ్మించింది. ఆగస్టులో వైజాగ్‌కు వస్తున్నానని అక్కడ పెళ్లి చేసుకుందామని చెప్పింది. నా చేత గ్లోబల్‌ ట్రేడ్‌ అనే సైట్‌లో రూ.12 లక్షల పెట్టుబడులు పెట్టించింది. అనంతరం ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసిందని లింగసముద్రానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

● బాలాజీ నగర్‌కు చెందిన రమేష్‌ బ్యాంక్‌ లోన్‌ ఇప్పిస్తానని నమ్మించి రూ.5.67 లక్షలు తీసుకున్నాడు. లోన్‌ ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement