
ఐదు కిలోల కణితి తొలగింపు
● పెద్దాస్పత్రి వైద్యుల ఘనత
నెల్లూరు(అర్బన్): తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన 35 ఏళ్ల తాటిపర్తి శశికళకు నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఆపరేషన్ చేసి ఆమె తొడ భాగం నుంచి ఐదు కిలోల కణితిని తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి జనరల్ సర్జన్ కాలేషాబాషా సోమవారం వెల్లడించారు. ఎడమ తొడ భాగంలో కణితి ఏర్పడి క్రమేపీ పెరుగుతూ వచ్చిందని, నొప్పి ఎక్కువ కావడంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆమె ఆశ్రయించారని చెప్పారు. రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో పెద్దాస్పత్రికి ఆమె వచ్చారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా.. లోపలి రక్తనాళాలకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించామని తెలిపారు. తనతో పాటు డాక్టర్లు సుహాసిని, ఉమామహేష్, మత్తు వైద్యులు శారదతో కూడిన వైద్య బృందం ఆపరేషన్‌లో పాల్గొందని తెలిపారు. ఆపరేషన్‌ను విజయవంతంగా చేసిన డాక్టర్లను ఆస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్ అభినందించారు.