టి20 ప్రపంచకప్‌ కదా.. ఆ మాత్రం ఉండాల్సిందే

Zimbabwe Players Celebrate Dressing Room After Team Qualifies 2022 T20 WC - Sakshi

ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే.  జింబాబ్వేతో పాటు నెదర్లాండ్స్‌ కూడా అనుమతి సాధించింది.  క్వాలిఫయింగ్‌ టోర్నీ (బి)లో ఈ రెండు జట్లు ఫైనల్‌ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది.

జింబాబ్వే జట్టు.. ఒకప్పుడు క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన దేశం. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లాంటి మేటిజట్లను ఓడించి సంచలనాలు నమోదు చేసింది. గత దశాబ్ద కాలం వరకు జింబాబ్వే జట్టు మోస్తరుగానే రాణించింది. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం వారి ఆటతీరు నాసిరకంగా తయారైంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. క్రికెట్‌లో పేద దేశంగా పేరు పొందిన జింబాబ్వేలో ఆటగాళ్లకు, బోర్డుకు అంతర్గత వ్యవహారాల్లో విబేధాలు, జాతి వివక్ష లాంటి ఎన్నో అంశాలు చుట్టుముట్టాయి.

ఒకప్పుడు  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న జింబాబ్వే ఇప్పుడు కనీసం ఆ దరిదాపున కూడా రావడం లేదు. దీనికి తోడూ బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఐర్లాండ్‌ లాంటి దేశాలు క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాయి. ఇవి కూడా జింబాబ్వేకు కొంత ప్రతీకూలమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టి20 ప్రపంచకప్‌ టోర్నీకి క్వాలిఫై అవడం పెద్ద ఘనత కిందే లెక్క. అందుకే జింబాబ్వే జట్టు దానిని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్‌ చేసుకుంది.

మ్యాచ్‌ విజయం అనంతరం జింబాబ్వే ఆటగాళ్లు టి20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అవ్వడాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లంతా ఒక దగ్గరికి చేరి తమ బ్యాట్లను నేలకు కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ''టి20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యామని తెలియగానే మా జట్టు సభ్యులు పెద్ద పండుగ చేసుకున్నారు.'' అంటూ ట్వీట్‌ చేసింది.

ఇక జింబాబ్వే కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ''టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించామంటే మాకు అది పెద్ద విషయం. ఈ సందర్భంగా నాకు మాటలు రావడం లేదు. మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో 200 పరుగులు కొట్టినప్పటికి దానిని నిలుపుకునేందుకు బౌలర్లు అద్భుత కృషి చేశారు. ఇక ప్రస్తుతం దృష్టంతా ఆదివారం జరగనున్న క్వాలిఫయర్‌ ఫైనల్‌ పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూఫ్‌-ఏలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత అక్టోబర్‌లో జరగనున్న టి20 వరల్డ్‌కప్‌పై దృష్టి పెడుతాం'' అంటూ కామెంట్‌ చేశాడు.

చదవండి: Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top