WTC Final Race: రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా! ఫైనల్‌ రేసులో ఆస్ట్రేలియాతో పాటు..

WTC Points Table After Aus Vs SA: India In 2 How Teams Reach Final - Sakshi

World Test Championship 2021-23 Updated Table: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మేటి జట్లు. ఇలాంటి బలమైన ప్రత్యర్థుల మధ్య టెస్టు మ్యాచ్‌ రెండే రోజుల్లో ముగియడం అసాధారణం. కానీ అదే జరిగింది.. పేసర్లకు స్వర్గధామమైన ‘గాబా’ పిచ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఆదివారం దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఈ విజయంతో 12 పాయింట్లు సాధించింది కమిన్స్‌ బృందం.

తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో గెలుపొంది మూడో స్థానంలో ఉన్న టీమిండియా.. ఆసీస్‌ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమితో రెండో స్థానానికి ఎగబాకింది.

సౌతాఫ్రికా ఒక స్థానం దిగజారి ప్రస్తుతం మూడో టాప్‌-3లో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ సీజన్‌ 2021-23 సీజన్‌లో టాప్‌-4లో ఉన్న జట్లకు మిగిలి ఉన్న మ్యాచ్‌లు, ఆసీస్‌- ప్రొటిస్‌ మొదటి టెస్టు ముగిసిన తర్వాత ఫైనల్‌ చేరే క్రమంలో ఏయే జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం!

ఆస్ట్రేలియా
►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- 6
►స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు, భారత పర్యటనలో నాలుగు టెస్టులు
►ప్రస్తుతం 120 పాయింట్లు(76.92 శాతం)తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
►సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను మరో రెండు మ్యాచ్‌లలో ఓడిస్తే ఇక టీమిండియాతో మాత్రమే టాప్‌-1 స్థానానికి పోటీ ఉంటుంది.
►స్వదేశంలో భారత జట్టును కట్టడి చేయగలిగితే ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టాప్‌-1 జట్టుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.

టీమిండియా
►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- బంగ్లాదేశ్‌ టూర్‌లో ఒకటి, స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు
►ప్రస్తుతం పాయింట్లు 87(55.77 శాతం)
►బంగ్లాతో రెండో టెస్టు గెలిచి, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నామమాత్రంగా రాణించినా చాలు రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశం టీమిండియా సొంతమవుతుంది.


డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక(PC: ICC)

దక్షిణాఫ్రికా
►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- ఆస్ట్రేలియాతో రెండు, స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు
►ప్రస్తుతం పాయింట్లు- 72(54.55 శాతం)
►ఆసీస్‌ చేతిలో తొలి టెస్టులో ఓటమితో దక్షిణాఫ్రికా రెండోస్థానాన్ని టీమిండియాకు కోల్పోయింది. అయితే, ఈ పరాజయం తర్వాత కూడా డీన్‌ ఎల్గర్‌ బృందానికి ఫైనల్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులు గెలవడం సహా విండీస్‌ను కట్టడి చేస్తే టాప్‌-2లో చోటు దక్కించుకోవచ్చు.

శ్రీలంక
►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టెస్టులు
►ప్రస్తుతం 64 పాయింట్లు(53.33 శాతం)
►కివీస్‌ గడ్డపై లంక విజయాల శాతం చాలా తక్కువ. 19 సార్లు టెస్టుల్లో ఆతిథ్య జట్టుతో పోటీపడితే కేవలం రెండుసార్లు గెలిచింది. ఇక ఇప్పుడు అద్భుతం జరిగి మిగిలిన రెండు టెస్టులు గెలిచినా 61.1 శాతంతో ఈ సీజన్‌ ముగిస్తుంది. అయితే, లంక కంటే ఇండియా, దక్షిణాఫ్రికాకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ లంక గెలిచి టాప్‌-2లో నిలవాలంటే ఆస్ట్రేలియా విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆసీస్‌- దక్షిణాఫ్రికా మొదటి టెస్టు సాగిందిలా..
ఓవర్‌నైట్‌ స్కోరు ఆదివారం 145/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా లంచ్‌కు ముందే 218 పరుగుల వద్ద ఆలౌటైంది. హెడ్‌ మరో 14 పరుగులు జతచేసి నిష్క్రమించగా, క్యారీ (22 నాటౌట్‌), గ్రీన్‌ (18), స్టార్క్‌ (14) రెండంకెల స్కోరు చేశారు. రబడ 4, జాన్సెన్‌ 3 వికెట్లు తీశారు. ఆసీస్‌కు 66 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

తర్వాత దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది. జొండో (36; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌! కమిన్స్‌ (5/42) నిప్పులు చెరిగాడు. అయితే వాన్‌ డెర్‌ డసెన్‌ (0)ను బౌల్డ్‌ చేయడంతో స్టార్క్‌ 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అతనికి, బొలాండ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 34 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఆస్ట్రేలియా... రబడ (4–1–13–4) పేస్‌ పదునుకు ఆపసోపాలు పడింది.

చివరకు 7.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసి నెగ్గింది. ఈ రెండు రోజుల్లో 34 వికెట్లు కూలడం విశేషం. పేస్‌కు బ్యాటర్సంతా విలవిలలాడిన పిచ్‌పై అత్యధిక స్కోరు చేసిన ట్రెవిస్‌ హెడ్‌ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్‌)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది. ఇక డిసెంబరు 26 నుంచి ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.   

చదవండి: Messi- Ronaldo: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! మరి రొనాల్డో సంగతి? ఆరోజు ‘అవమానకర’ రీతిలో..
Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top