French Open: వరల్డ్‌ నంబర్‌ 1తో పోరులో ఓటమి.. నేను అబ్బాయినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల!

Wish I Can Be A Man: Zheng Qinwen After Menstrual Cramps End Her Dreams - Sakshi

Zheng Qinwen French Open 2022: ‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్‌ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్‌ క్రీడాకారిణి జెంగ్‌ కిన్వెన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది.

ప్రతిష్టాత్మక టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ అరంగేట్రంలోనే నాలుగో రౌండ్‌కు చేరుకున్న నాలుగో చైనీస్‌ మహిళగా కిన్వెన్‌ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్‌, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌తో తలపడే అవకాశం దక్కించుకుంది ఈ 19 ఏళ్ల చైనీస్‌ టీనేజర్‌.

అయితే, సోమవారం నాటి ఈ మ్యాచ్‌ సందర్భంగా కిన్వెన్‌ రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి కారణంగా విలవిల్లాడింది. స్వియాటెక్‌తో మ్యాచ్‌లో తొలి సెట్‌ వరకు బాగానే ఉన్న కిన్వెన్‌.. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో అక్కడే బ్యాక్‌ మసాజ్‌ చేయించుకుంది. ఆ తర్వాత కుడి తొడకు కట్టు కట్టుకుని బరిలోకి దిగింది. 

ఈ క్రమంలో 6-7(5), 6-0, 6-2 తేడాతో స్వియాటెక్‌ చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. దీంతో కిన్వెన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఎంతకష్టమైనా మ్యాచ్‌ పూర్తి చేయడానికే నేను ఇష్టపడతా. నా స్వభావానికి విరుద్ధంగా వెళ్లను.

అయితే, ఈరోజు కోర్టులో ఉన్న సమయంలో నేను పురుషుడినైతే బాగుండేదనిపించింది. ఆ క్షణంలో నిజంగా నేను మగాడిని అయి ఉంటే.. ఈ బాధ తప్పేది. పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో. ’’ అని వ్యాఖ్యానించింది. కడుపునొప్పి, కాలు నొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

అయితే, వరల్డ్‌ నెంబర్‌ 1తో పోటీపడిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించానని ఈ 74వ ర్యాంకర్‌ పేర్కొంది. అయితే, కడుపునొప్పి లేకుండా మరింత ఎక్కువగా ఎంజాయ్‌ చేసేదానినని, ఇంకాస్త బాగా ఆడేదానిని తెలిపింది. తనతో మరో మ్యాచ్‌ అవకాశం వచ్చినపుడు మాత్రం అస్సలు ఇలాంటి పరిస్థితి(రుతుస్రావం) ఎదురుకాకూడదని ఉద్వేగపూరితంగా మాట్లాడింది. 

ఇదిలా ఉంటే.. కిన్వెన్‌పై విజయంతో ఈ ఏడాది వరుసగా 32వ గెలుపు నమోదు చేసింది పోలాండ్‌కు చెందిన స్వియాటెక్‌. క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టిన ఆమె.. టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. క్వార్టర్‌లో అమెరికాకు చెందిన జెసికా పెగులాతో ఆమె అమీతుమీ తేల్చుకోనుంది.

చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్‌.. ఐపీఎల్‌లో మోస్ట్‌ లక్కీ ప్లేయర్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top