సొంతగడ్డపై వెస్టిండీస్ చతికిలపడింది. పర్యాటక శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య ఈ మెగా ఈవెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా విండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు వన్డేలు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో సిరీస్ 1-0తో శ్రీలంక వశమైంది.
పదో స్థానంలో...
ఫలితంగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. కాగా శ్రీలంకతో సిరీస్ ద్వారా ఈ సైకిల్ (2023-2027)లో విండీస్ ఇప్పటికి 32 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.
ఇందులో 11 గెలిచి, 18 ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో మొత్తంగా 73 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ పట్టికలో పదో స్థానంలో ఉంది.
టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే
కాగా పట్టికలో టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలో అడుగుపెడతాయి.
ఇక విండీస్‌కు ఈ సైకిల్‌లో దాదాపుగా తొమ్మిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జూలైలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనున్న కరేబియన్ జట్టు.. తదుపరి భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం అఫ్గనిస్తాన్‌కు మూడు వన్డేల కోసం ఆతిథ్యం ఇస్తుంది.
వరుసగా రెండోసారి..
ఈ సిరీస్‌లలో వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శనతో గెలవాల్సి ఉంటుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే విండీస్ అవకాశాలు మరింత సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే వెస్టిండీస్ వరుసగా రెండోసారి గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.
ఇందులో నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీలో ఉంటాయి. ఉదాహరణకు.. స్కాట్లాండ్, నమీబియా, ఐర్లాండ్ వంటి చిన్నజట్లు రీజినల్ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటడం ద్వారా గ్లోబల్ క్వాలిఫయర్‌లో అడుగుపెడతాయి. కాగా గత ఎడిషన్‌లో వెస్టిండీస్‌కు ఈ టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది.
గత ఎడిషన్‌కు అర్హత సాధించకుండానే..
స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి.. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి అర్హత సాధించకుండానే వెస్టిండీస్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు ఈ మేరకు అర్హత కూడా సాధించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక ప్రస్తుతం పటిష్టమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్, టీమిండియాపై వెస్టిండీస్ సత్తా చాటాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత సైకిల్‌లో కూడా విండీస్‌కు క్వాలిఫయర్స్ ఆడే గండం తప్పకపోవచ్చని అనిపిస్తోంది.


