T20 WC 2022: మై​కెల్‌ వాన్‌ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్‌

Wasim Jaffer Trolls Michael Vaughan Hilarious Meme After IRE Beat ENG - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12లో గ్రూఫ్‌-1లో ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ఇంగ్లండ్‌ కొంపముంచింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి చేయాల్సినదానికంటే ఐదు పరుగులు తక్కువగా ఉండడంతో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. ఈ ఇద్దరి మధ్య సోషల్‌ మీడియాలో ఎప్పటినుంచో కోల్డ్‌వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫన్నీవేలో కామెంట్స్‌ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. 

తాజాగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ విజయం సాధించాకా.. జాఫర్‌ వాన్‌ను ఉద్దేశించి ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఒకరు ఐర్లాండ్‌.. ఇంకొకరు ఇంగ్లండ్‌. ఇంతలో వీరి మధ్యకు ట్రిమ్మర్‌ తీసుకొని ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు డక్‌వర్త్‌ లూయిస్(డీఎల్‌ఎస్‌). మ్యాచ్‌కు వర్షం ఎలా అయితే అంతరాయం కలిగించిందో.. అచ్చం అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు సీరియస్‌గా ఫైట్‌ చేసుకుంటున్న సందర్భంలో సదరు డీఎల్‌ ఇంగ్లండ్‌కు సపోర్ట్‌ చేద్దామనుకుంటున్నాడు. కానీ చివర్లో ఫలితం తారుమారు కావడంతో ఇంగ్లండ్‌ వ్యక్తికే జట్టు తీసేస్తాడు. ఇక చివర్లో మ్యాచ్‌ సమ్మరీ ఇదే అంటూ క్యాప్షన్‌ జత చేసి మైకెల్‌ వాన్‌ ట్యాగ్‌ను జత చేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. మార్క్‌ వుడ్‌ (3/34), లివింగ్‌స్టోన్‌ (3/17), సామ్‌ కర్రన్‌ (2/31), స్టోక్స్‌ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్‌ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి.

ఓపెనర్ జోస్‌ బట్లర్‌ డకౌట్‌ కాగా..  మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్‌ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్‌ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (1 నాటౌట్‌) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్‌ స్కోర్‌ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.

చదవండి: 'కోహ్లి మమ్మల్ని కరుణిస్తాడనుకుంటున్నా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top