సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్‌ | Washington Sundar completed 100 wickets in First Class cricket | Sakshi
Sakshi News home page

సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్‌

Jun 8 2026 4:47 PM | Updated on Jun 8 2026 4:54 PM

Washington Sundar completed 100 wickets in First Class cricket

టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో (టెస్ట్‌లు, దేశవాలీ మల్టీ డే మ్యాచ్‌లు) 100 వికెట్లు పూర్తి చేసుకున్న రేర్‌ లిస్ట్‌లో చేరాడు. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన సుందర్‌.. 78 ఇన్నింగ్స్‌ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. 

అదనంగా సుందర్‌ బ్యాటింగ్‌లో 2100 పైచిలుకు పరుగులు కూడా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. మొత్తంగా అతడి ఫస్ట్‌ క్లాస్‌ బ్యాటింగ్‌ కెరీర్‌లో 3 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు ఉన్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌ టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ తేడాతో పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. 

ముఖ్యంగా అరంగేట్రం లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 1), వాషింగ్టన్‌ సుందర్‌ (1, 4) ప్రత్యర్ది భరతం పట్టారు. వీరికి కుల్దీప్‌ (3), ప్రసిద్ద్‌ కృష్ణ (3) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి టెస్ట్‌లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్‌ సుతార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 564-8 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ (100), కెప్టెన్‌ శుభ్‌మన​్‌ గిల్‌ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్‌ (81), రిషబ్‌ పంత్‌ (81), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. 

మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌ 24, ధృవ్‌ జురెల్‌ 19, మానవ్‌ సుతార్‌ 28, మహ్మద్‌ సిరాజ్‌ 22, కుల్దీప్‌ యాదవ్‌ 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో మహ్మద్‌ సలీమ్‌ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్‌ రహ్మాన్‌, కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది తలో వికెట్‌ తీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement