శార్దూల్‌, వషీ జబర్దస్త్‌‌; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్‌

Washington Sundar And Shardul Thakur Adorable Batting At Brisbane - Sakshi

బ్రిస్బేన్‌: కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమై తుది జట్టుకు సరిపడా 11 మంది ఉంటే చాలుననే పరిస్థితుల నడుమ టీమిండియా వారిపై నమ్మకముంచింది. బాగా ఆడండి అని బెస్టాఫ్‌ లక్‌ చెప్పింది. ఆ నమ్మకాన్ని నిజం చేశారు వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌. ముగ్గురికీ పెద్దగా అనుభవం లేకపోయినా బౌలింగ్‌ విభాగంలో తలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా.. బ్యాటింగ్‌ లోనూ శార్దూల్‌, సుందర్‌ మేటి ఆట ఆడారు. పటిష్టమైన ఆసీస్‌ బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కొని క్లిష్ట సమయంలో అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. బ్రిస్బేన్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. 


(చదవండి: వీరాభిమాని నం.1)

ఏడో వికెట్‌గా శార్దూల్‌ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటైన అనంతరం టీమిండియా బ్యాటింగ్‌ ఎంతోసేపు కొనసాగలేదు. ఆ వెంటనే నవదీప్‌ సైనీ (5), సుందర్‌ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌), సిరాజ్‌ (13) పెవిలియన్‌ చేరారు. నటరాజన్‌ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. హేజిల్‌వుడ్‌ 5 వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. స్టార్క్‌, కమినన్స్‌ చెరో రెండు వికెట్లు, లైయన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. మార్కస్‌ హేరిస్‌ (1), డేవిడ్‌ వార్నర్‌ (20) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 33 పరుగుల ఆదిక్యంతో ఆసీస్‌ ప్రస్తుతం 54 పరుగుల లీడింగ్‌లో ఉంది. ఇక శార్దూల్‌, సుందర్‌ పోరాటపటిమపై అటు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, ఇటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్న అసలైన ఆటగాళ్లు అని అభిమానులు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. 

అడిలైడ్‌ టెస్టును గుర్తు చేసుకున్న వీరూ
186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్‌, వషీ గుర్తుండిపోయే భాగస్వామ్యాన్ని నెలకొల్పారని టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 2003లో అడిలైడ్‌ వేదికగా జరిగిన టెస్టు గుర్తొస్తుందని చెప్పాడు. అప్పుడు కూడా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వెనుకబడి ఉందని, తాజా గబ్బా టెస్టులోనూ అదే జరిగిందని అన్నాడు. 133 పరుగుల ఆదిక్యం లభిస్తుందని భావించిన ఆసీస్‌కు శార్దూల్‌, వషీ పోరాటంతో 33 పరుగులు మాత్ర దక్కాయని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఆసీస్‌ నలుగురు బౌలర్లకు 1000 వికెట్లు తీసిన అనుభవం ఉండగా.. గబ్బా టెస్టులో టీమిండియా ఐదుగురు బౌలర్లకు 11 వికెట్లు తీసిన అనుభవమే ఉన్నా వారి అద్భుత ఆటతీరు జబర్దస్త్‌గా ఉందని పేర్కొన్నాడు. కాగా, 2003 నాటి అడిలైడ్‌ టెస్టులో భారత్‌ విజయం విజయం సాధించడం గమనార్హం.
(చదవండి: నేను ఇలాగే ఆడతా : రోహిత్‌ శర్మ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top