‘నా పేస్‌ దెబ్బకు కోహ్లినే బిత్తర పోయాడు’

Virat Kohli Was Surprised By My Pace, Mohammad Irfan - Sakshi

కరాచీ: భారత్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు గౌతం గంభీర్‌ తన కళ్లలోకి చూడాలంటే భయపడేవాడని కొన్ని రోజుల క్రితం పేర్కొన్న పాకిస్తాన్‌ వెటరన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌.. తాజాగా తన బౌలింగ్‌ చూసి టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లినే బిత్తరపోయాడన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం భారత పర్యటనలో భాగంగా కోహ్లి తన బౌలింగ్‌ను చూసి ఆశ్చర్యపోయాడన్నాడు. ఈ మేరకు ఆనాటి జ్ఞాపకాల్ని పాకిస్తాన్‌ బ్రాడ్‌కాస్టర్‌ సవేరా పాషాతో మహ్మద్‌ ఇర్ఫాన్‌ పంచుకున్నాడు. క్రిక్‌ కాస్ట్‌లో భాగంగా యూట్యూబ్‌ చాట్‌లో పలు విషయాల్ని తెలిపాడు. ఆ  భారత పర్యటనలో తాను పెద్ద పేసర్‌ను కాదని భారత ఆటగాళ్లు అంచనా వేశారని, కాకపోతే తన బౌలింగ్‌లో వేగం చూసి అంతా ఆశ్చర్యపోయారన్నాడు. (ఎంఎస్‌ ధోనికి గ్రీన్‌ సిగ్నల్‌)

‘ నేను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు నన్ను తక్కువగా అంచనా వేశారు. భారత కోచ్‌లు నా బౌలింగ్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. నేను 130-135 కి.మీ వేగంతో బౌలింగ్‌ వేస్తానని భారత ఆటగాళ్లకి చెప్పారట. ఈ విషయాన్ని భారత క్రికెటర్లే నాకు చెప్పారు. కాకపోతే కోహ్లి ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా బౌలింగ్‌ చూసి ఆశ్చర్యపోయాడట. నేను 145-146 కి.మీ వేగంతో బౌలింగ్‌ వేయడం చూసి అతని  పక్కనే ఉన్న కోచ్‌ను ప్రశ్నించాడట. ఇదే విషయాన్ని కోహ్లినే నాకు చెప్పాడు. ఇద్దరం ఎదురుపడినప్పుడు స్వయంగా కోహ్లినే నా బౌలింగ్‌ను ప్రశంసించాడు. నిన్ను మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అన్నారు. నువ్వేమో 150కి.మీ వేగంతో బౌలింగ్‌ వేస్తున్నావు అన్నాడు’ అని ఏడడుగుల ఒక అంగుళం ఎత్తు ఉండే మహ్మద్‌ ఇర్ఫాన్‌ తెలిపాడు.2017లో పీసీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కింద నిషేధం ఎదుర్కొన్న ఇర్ఫాన్‌.. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. ఏడు అడుగులు పైగా ఉండే ఇర్ఫాన్‌.. 2012లో భారత పర్యటనకు వచ్చాడు. ఆ సిరీస్‌లో గౌతం గంభీర్‌ను నాలుగుసార్లు(వన్డేలు, టీ20లు) ఔట్‌ చేశాడు.(10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top