సచిన్‌ పాజీతో మాట్లాడిన తర్వాతే: కోహ్లి

Virat Kohli Recalls How Tendulkar Helped Him After 2014 England Debacle - Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సలహాలు, సూచలనతోనే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగ్గా రాణించగలిగానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. హిప్‌ అలైన్‌ మార్చుకున్న తర్వాత తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లి సహచర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో వీడియో చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్‌ టూర్‌లో బ్యాటింగ్‌ పరంగా తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేస్తున్నాడు. 

‘‘ఇంగ్లండ్‌ టూర్‌లో హిప్‌ పొజిషన్‌ నాకెంతో సమస్యాత్మకంగా మారింది. అయినప్పటికీ నేనేం ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ కఠినంగా ముందుకు సాగాను. అయితే తొందరగానే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నిజం చెప్పాలంటే అదో బాధాకరమైన విషయం. ఓ బ్యాట్స్‌మెన్‌గా కుడి వైపు తుంటి భాగాన్ని బాగా చాచినపుడు లేదా దగ్గరకు తీసుకువచ్చినపుడు మనం ప్రమాదంలో పడతామనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అందుకే హిప్‌ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కాస్త బ్యాలెన్స్‌ చేస్తూ బ్యాటింగ్‌ చేయడం చాలా ముఖ్యమైనది. ఇంగ్లండ్‌ టూర్‌లో నేను ఈ టెక్నిక్‌ మిస్సయ్యానని అనిపిస్తూ ఉంటుంది. (1000వ పోస్టును షేర్ చేసిన కోహ్లి)

ఆ తర్వాత ముంబైలో సచిన్‌ పాజీని కలిశాను. ఫార్వర్డ్‌ ప్రెస్‌(బలంగా నిల్చుని కాలు ముందు చాచడం) ద్వారా ఫాస్ట్‌ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే టెక్నిక్స్‌ నేర్చుకున్నా. అదే వ్యూహాన్ని ఆసీస్‌ టూర్‌లో అమలు చేశాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2014 ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కలిపి 13.40 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి కెరీర్‌లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్‌ టూర్‌లోని అనుభవాల దృష్ట్యా టెక్నిక్స్‌ మార్చుకుని ఆసీస్‌ టూర్‌(2014-15)లో 692 పరుగులతో రాణించి సత్తా చాటాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top