
వాషింగ్టన్: సుదీర్ఘ విరామం తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌లో పునరాగమనం చేసిన అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ సింగిల్స్ విభాగంలోనూ శుభారంభం చేసింది. సిటీ డీసీ ఓపెన్–500 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో 45 ఏళ్ల వీనస్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో వీనస్ 6–3, 6–4తో ప్రపంచ 35వ ర్యాంకర్, 23 ఏళ్ల పేటన్ స్టెర్న్స్‌పై గెలుపొందింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
ఈ గెలుపుతో మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్‌లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయస్కురాలిగా వీనస్ గుర్తింపు పొందింది. ఇంతకుముందు 2004లో మార్టినా నవ్రతిలోవా 47 ఏళ్ల వయస్సులో సింగిల్స్ మ్యాచ్ నెగ్గింది.
2024 మయామి ఓపెన్‌లో చివరిసారి ఆడిన వీనస్ ఆ తర్వాత గాయాల కారణంగా ఆటకు విరామం ఇచ్చింది. 2023 ఆగస్టులో జరిగిన సిన్సినాటి ఓపెన్ టోర్నీ తర్వాత వీనస్ సింగిల్స్ మ్యాచ్ నెగ్గడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని పదేపదే ప్రార్థిస్తున్నాను’ పేటన్‌పై విజయానంతరం వీనస్ వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్‌ను వీనస్ కాబోయే భర్త, ఇటలీకి చెందిన సినీ నటుడు, నిర్మాత ఆండ్రియా ప్రెటి కూడా తిలకించాడు.
విజయంతో రీఎంట్రీ
ఇక పునరాగమనంలో వీనస్ విలియమ్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఏడాది తర్వాత రాకెట్ పట్టిన ఆమె డీసీ ఓపెన్‌లో శుభారంభం చేసింది. కెరీర్‌లో సింగిల్స్, డబుల్స్‌లో కలిపి 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 45 ఏళ్ల వీనస్ తన దేశానికే చెందిన హైలీ బాప్టిస్ట్‌తో కలిసి డీసీ ఓపెన్ డబుల్స్‌లో ఆడుతోంది. తొలి రౌండ్‌లో వీనస్–హైలీ జంట 6–3, 6–1తో 2014 వింబుల్డన్ రన్నరప్ యూజీనీ బుచార్డ్ (కెనడా)–క్లార్వీ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది.
మూడేళ్ల తర్వాత డబుల్స్ మ్యాచ్ ఆడిన వీనస్... కిక్కిరిసిన మైదానంలో మొదట తడబడినా... ఆ తర్వాత తన ట్రేడ్‌మార్క్ షాట్‌లతో ఆకట్టుకుంది. ‘ఆటను ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాను. ప్రస్తుతం అదే నా ప్రాథమిక లక్ష్యం. నాపై నేను ఎక్కువ ఒత్తిడి పెంచుకోవాలని అనుకోవడం లేదు. గెలుపంటే నాకు ఇష్టం.
ఎలాంటి స్థితిలో అయినా గెలిచేందుకే ప్రయత్నిస్తా. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించా’ అని వీనస్ వెల్లడించింది. 2024 మయామి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు దూరమైన వీనస్... వైల్డ్ కార్డ్‌తో తాజా టోరీ్నలో బరిలోకి దిగింది.
దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2022 యూఎస్ ఓపెన్‌లో సోదరి సెరెనా విలియమ్స్‌తో కలిసి బరిలోకి దిగిన అనంతరం వీనస్ ఇక డబుల్స్ మ్యాచ్ ఆడలేదు. వింబుల్డన్‌లో ఐదు (2000, 2001, 2005, 2007, 2008) సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వీనస్... 2000, 2001లో యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది.
డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన వీనస్... ఒలింపిక్స్‌లో 4 పసిడి పతకాలు చేజిక్కించుకుంది. ఇక ఇదే టోర్నీ సింగిల్స్‌లో సైతం వీనస్ బరిలోకి దిగనుంది. తొలి రౌండ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ 23 ఏళ్ల పేటన్ స్టెర్న్‌తో తలపడనుంది.
యూఎస్ ఓపెన్‌లో వీనస్
వచ్చే నెలలో జరగనున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో వీనస్ విలియమ్స్ బరిలోకి దిగనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో అమెరికాకే చెందిన రీలీ ఒపెల్కాతో కలిసి వీనస్ ఆడనుంది. వింబుల్డన్ రన్నరప్ అమండా అనిసిమోవా (అమెరికా) కూడా యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొననుంది. హోల్గర్ రూనె (డెన్మార్క్)తో కలిసి ఆమె డబుల్స్‌లో బరిలోకి దిగనుంది.
ఈ మేరకు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. కొత్తగా చేర్చిన జాబితాలో మొత్తం 25 జోడీలు పోటీపడుతున్నాయి. పేర్లు నమోదు చేసుకునేందుకు మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సింగిల్స్ మ్యాచ్‌లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానుండగా... అందకు వారం రోజులు ముందుగానే మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లు మొదలవుతాయి.