వైభవ్‌ టీమిండియా ఎంట్రీ ఖరారు | Vaibhav Sooryavanshi India Debut Confirmed, To Open With Abhishek Sharma Against | Sakshi
Sakshi News home page

వైభవ్‌ టీమిండియా ఎంట్రీ ఖరారు

Apr 14 2026 10:09 AM | Updated on Apr 14 2026 11:13 AM

Vaibhav Sooryavanshi India Debut Confirmed, To Open With Abhishek Sharma Against

భారత క్రికెట్‌కు సంబంధించి ఓ సంచలన వార్త అందుతోంది. ఐపీఎల్‌ 2026 వీరలెవెల్లో రెచ్చిపోతున్న, యువ చిచ్చరపిడుగు, రాజస్థాన్‌ రాయల్స్‌ కెరటం వైభవ్‌ సూర్యవంశీ త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్‌ తర్వాత జరిగే ఐర్లాండ్‌, జింబాబ్వే టీ20 సిరీస్‌లలో అతను బరిలోకి దిగడం ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.

15 ఏళ్ల వైభవ్‌ ఎంపికపై సెలెక్టర్లు తొలుత ముల్లగుల్లాలు (వయసు రిత్యా) పడినప్పటికీ.. ఆతర్వాత ప్రతిభే కొలమానంగా ఎంపికే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైభవ్‌ ఎంపిక కేవలం ఐపీఎల్‌ ఆధారంగానే కాకుండా  అండర్‌-19 జట్టు తరఫున ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకొని చేయనున్నట్లు సమాచారం.

వైభవ్‌ ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లో విశేషంగా రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా భారత్‌ జగజ్జేతగా అవతరించింది. వైభవ్‌ ఇటీవలే దేశవాలీ క్రికెట్‌లోకి (బిహార్‌ తరఫున) కూడా అరంగేట్రం చేసి, అక్కడ కూడా సత్తా చాటాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న భారత సెలెక్టర్లు, వైభవ్‌ టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు చేశారు.

ఐపీఎల్‌ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్‌, జింబాబ్వేల్లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపిక చేసి టీమిండియాకు గ్రాండ్‌గా పరిచయం చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. 

ఈ సిరీస్‌లలో వైభవ్‌కు జతగా మరో చిచ్చరపిడుగు అభిషేక్‌ శర్మ ఉండవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరు బరిలోకి దిగితే పసికూనలైన ఐర్లాండ్‌, జింబాబ్వే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వైభవ్‌-అభిషేక్‌ జోడీ టీ20 ఫార్మాట్‌లో అత్యంత భయంకరమైన ఓపెనింగ్‌ జోడీగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి.  

చరిత్ర సృష్టిస్తాడు
ఐర్లాండ్‌, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్‌ టీమిండియా అరంగేట్రం జరిగితే సరికొత్త చరిత్ర అవుతుంది. అతి చిన్న వయసులో టీమిండియా అరంగేట్రం​ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్‌ జూన్‌ 26న ఐర్లాండ్‌పై తొలి టీ20 ఆడితే, ఆ సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు 91 రోజులు అవుతుంది. 

ఒకవేళ ఆ మ్యాచ్‌ కాకపోయినా, ఐర్లాండ్‌, జింబాబ్వే సిరీస్‌ల్లో ఏ మ్యాచ్‌లో అరంగేట్రం చేసినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, భారత్‌ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. సచిన్‌  16 సంవత్సరాలు 205 రోజుల వయసులో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లెక్కన వైభవ్‌-సచిన్‌కు చాలా గ్యాప్‌ ఉంటుంది.

ఆకాశమే హద్దు
ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో వైభవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో సగటు 40, స్ట్రైక్‌ రేట్‌ 263.16తో 200 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్లలో ఒకడిగా చలామణి అవుతున్నాడు. ఈ ఎడిషన్‌లో వైభవ్‌.. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ లాంటి ప్రపంచ మేటి బౌలర్లకు సైతం​ చుక్కలు చూపిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement