US Open 2022: అల్‌కరాజ్‌ అద్భుతం

US Open 2022: Carlos Alcaraz prevails over Jannik Sinner in latest ever US Open finish - Sakshi

5 గంటల 15 నిమిషాల క్వార్టర్స్‌లో సిన్నర్‌పై విజయం

సెమీస్‌ చేరిన టియాఫో స్వియాటెక్, సబలెంకా కూడా

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

న్యూయార్క్‌: 315 నిమిషాలు... 19 ఏళ్ల కార్లోస్‌ అల్‌కరాజ్, 21 ఏళ్ల జన్నిక్‌ సిన్నర్‌ మధ్య జరిగిన యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ సమరమిది. యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో రెండో సుదీర్ఘ పోరుగా రికార్డులకెక్కిన ఈ మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడగా చివరకు అల్‌కరాజ్‌దే పైచేయి అయింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ముగిసిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) 6–3, 6–7 (7/9), 6–7 (0/7), 7–5, 6–3 స్కోరుతో 11వ సీడ్‌ సిన్నర్‌ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు.

తద్వారా 1990 (పీట్‌ సంప్రాస్‌) తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సెమీ ఫైనల్లో అల్‌కరాజ్‌ 22వ సీడ్‌ ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)తో తలపడతాడు. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో టియాఫో 7–6 (7/3), 7–6 (7/0), 6–4 తేడాతో ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించి సెమీస్‌ చేరాడు. 2006 (ఆండీ రాడిక్‌) తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన తొలి అమెరికా ఆటగాడు టియాఫో కావడం విశేషం.  

ప్రతీ షాట్‌లో పోరాటం...
ఈ ఏడాది వింబుల్డన్‌లో సిన్నర్‌ చేతిలో ఓడిన అల్‌కరాజ్‌ ప్రతీకారం తీర్చుకునే దిశగా తొలి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్‌ చేసి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్‌లో కోలుకున్న సిన్నర్‌ గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్‌ పాయింట్లు కాపాడుకున్న అతను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడా మరో సెట్‌ పాయింట్‌ను కాచుకొని స్కోరు సమం చేశాడు. మూడో సెట్‌లో కూడా ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే ఈ సారి అల్‌కరాజ్‌ ముందుగా 4–2తో, ఆపై 6–5తో ఆధిక్యంలోకి వెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు. సిన్నర్‌ పదునైన డిఫెన్స్‌తో స్పెయిన్‌ ఆటగాడిని అడ్డుకోగలిగాడు.

నాలుగో సెట్‌ మళ్లీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు దురదృష్టం సిన్నర్‌ను పలకరించింది. 5–4తో ఆధిక్యంలో ఉండి సెమీస్‌ చేరేందుకు సర్వీస్‌ చేసిన అతను అనూహ్యంగా పట్టు కోల్పోయాడు. పుంజుకున్న అల్‌కరాజ్‌ పదో గేమ్‌తో పాటు మరో రెండు గేమ్‌లు వరుసగా నెగ్గి ఫలితాన్ని చివరి సెట్‌కు తీసుకెళ్లాడు. అ ప్పటికే ఇద్దరూ తీవ్రంగా అలసిపోగా...అల్‌కరాజ్‌ మాత్రం పట్టుదల కనబర్చి ఏకపక్షంగా సెట్‌ను సాధించి మ్యాచ్‌ గెలుచుకున్నాడు. సిన్నర్‌ 8, అల్‌కరాజ్‌ 5 ఏస్‌ల చొప్పున కొట్టగా... అల్‌కరాజ్‌ అనవసర తప్పిదాలు(38)తో పోలిస్తే సిన్నర్‌ (61) ఎక్కువ తప్పులతో మూల్యం చెల్లించుకున్నాడు.  

నంబర్‌వన్‌ జోరు...
మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), అరైనా సబలెంకా (బెలారస్‌) సెమీస్‌లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్‌ 6–3, 7–6 (7/4) స్కోరుతో ఎనిమిదో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించగా...ఆరో సీడ్‌ సబలెంకా 6–1, 7–6 (7/4)తో కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top