US Open 2021: కొత్త చాంపియన్‌ అవతరించనుంది!

US Open 2021: Maria Sakkari Beats Bianca Enters Quarters - Sakshi

బియాంకా నిష్ర్కమణ

న్యూయార్క్‌: ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ అవతరించనుంది. 2019 చాంపియన్‌ బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరగడంతో మాజీ విజేతలెవరూ బరిలోకి మిగల్లేదు. 3 గంటల 29 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 17వ సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) 6–7 (2/7), 7–6 (8/6), 6–3తో ఆరో సీడ్‌ బియాంకాపై విజయం సాధించింది. రెండో సెట్‌ టైబ్రేక్‌లో సాకరి మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకోవడం విశేషం. మరోవైపు సంచలనాలతో దూసుకొచ్చిన క్వాలిఫయర్, 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) తన దూకుడు కొనసాగిస్తూ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రాడుకాను 6–2, 6–1తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)ను 56 నిమిషాల్లో చిత్తు చేసింది. మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్, వరల్డ్‌ నంబర్‌వన్‌ యాష్లే బార్టీని ఓడించిన షెల్బీ ఈ మ్యాచ్‌లో బ్రిటన్‌ టీనేజర్‌ ధాటికి ఎదురునిలువలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో 11వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) 7–6 (14/12), 6–3తో ఏడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)ను, నాలుగో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–5, 6–4తో 14వ సీడ్‌ పావ్లుచెంకోవా (రష్యా)ను ఓడించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో టోక్యో ఒలింపిక్‌ చాంపియన్‌ బెన్‌చిచ్‌తో రాడుకాను; ప్లిస్కోవాతో సాకరి; స్వితోలినా (ఉక్రెయిన్‌)తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా); సబలెంకా (బెలారస్‌) తో క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తలపడతారు.

చదవండి: Us Open 2021: క్వార్టర్‌ ఫైనల్లోకి వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top